హుజురాబాద్ బీసీ గురుకులంలో ఘనంగా బోనాల వేడుకలు.
సాంప్రదాయ దుస్తుల్లో విద్యార్థినుల సందడి.. అమ్మవారికి బోనాల సమర్పణ.
హుజురాబాద్, ఆగస్టు 08 (తెలంగాణ ముచ్చట్లు ):
హుజురాబాద్ పట్టణంలోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకుల బాలికల పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాల వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రాంగణం భక్తిశ్రద్ధలతో, జాతర వాతావరణాన్ని తలపించేలా సందడిగా మారింది.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థినులు సంప్రదాయ దుస్తులు ధరించి, పసుపు, కుంకుమ, వేపాకులతో ప్రత్యేకంగా అలంకరించిన బోనాలను ఎత్తుకొని అమ్మవారికి సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్యార్థినులు బోనాలతో నిర్వహించిన ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ టి. శారద మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర పండుగైన బోనాలను పాఠశాల ఆవరణలో నిర్వహించి అమ్మవారికి బోనం సమర్పించినట్లు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను విద్యార్థులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ వేడుకలను నిర్వహించినట్లు పేర్కొన్నారు.
పసుపు, కుంకుమ, వేపాకులతో అలంకరించిన బోనాలను ఎత్తుకొని ఉపాధ్యాయులు, విద్యార్థినులు చేసిన ఊరేగింపు ఆకట్టుకుందని తెలిపారు. తెలంగాణ సంస్కృతిలో ఆడబిడ్డలకు ఉన్న ప్రత్యేక ప్రాధాన్యతను చాటేలా బోనాల వేడుకలను నిర్వహించామని ప్రిన్సిపల్ అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏటీపీ నాగరాణి, బీడబ్ల్యూ నీరజ, కే. రజిత, పీ. రజిత, ఉపాధ్యాయులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.


Comments