గ్రామస్తుల దరి చేరిన కార్పొరేట్ వైద్యం.
వల్బాపూర్‌లో ఉచిత వైద్య శిబిరం.
వీణవంక, ఆగస్టు 08 (తెలంగాణ ముచ్చట్లు):
వీణవంక మండలం వల్బాపూర్ గ్రామ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో బాలవికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో, జమ్మికుంట ఆదిత్య అమృత మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి సౌజన్యంతో శనివారం గ్రామపంచాయతీ ఆవరణలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ అందే శ్రీమతి-కుమార్ మాట్లాడుతూ మారుతున్న ఆహారపు అలవాట్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కల్తీ ఆహార పదార్థాలకు దూరంగా ఉండడంతో పాటు ప్రతిరోజూ తగినంత నీరు తీసుకోవాలని, ఆకుకూరలు, కూరగాయలను ఆహారంలో భాగం చేసుకోవాలని సూచించారు.
వైద్యులు డాక్టర్ భరత్, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ గ్రీష్మ మాట్లాడుతూ కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాన్ని తగ్గించి పోషక విలువలు కలిగిన సమతుల్య ఆహారం తీసుకోవాలని సూచించారు. నిత్యం వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. జంక్‌ఫుడ్ అధికంగా తీసుకోవడం వల్ల యువతలో ఊబకాయం పెరుగుతోందని, బరువును నియంత్రించుకోవడం ముఖ్యమని తెలిపారు.
ఆదిత్య ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ ఎలుక దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ బాలవికాస సంస్థ సమాజ సేవలో చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు. పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు. గతంలో కూడా ఆదిత్య, అమృత ఆసుపత్రుల ఆధ్వర్యంలో పలు వైద్య శిబిరాలు నిర్వహించి ఉచిత పరీక్షలు, మందులు అందించినట్లు చెప్పారు. భవిష్యత్తులోనూ ఇలాంటి సేవా కార్యక్రమాలకు తమ సహకారం కొనసాగుతుందని తెలిపారు. వల్బాపూర్ గ్రామ ప్రజలకు తమ ఆసుపత్రిలో ఉచిత ఓపీ సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు.
ఉప సర్పంచ్ నామని విజేందర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామంలో మురుగునీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.
జమ్మికుంట బాలవికాస సెంటర్ మేనేజర్ పబ్బు సులోచన మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యంపై అవగాహన పెంచుకుని ఇంటిని ఆరోగ్యానికి తొలి కేంద్రంగా మార్చుకోవాలని సూచించారు. బాలవికాస ఆధ్వర్యంలో 14 సెంటర్ల పరిధిలోని 180 గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు సుమారు రూ.2 కోట్ల విలువైన మందులను ఉచితంగా పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బాలవికాస కోఆర్డినేటర్ స్వాతి, కరోబార్ రాజశేఖర్, పాలకవర్గ సభ్యులు, ఆదిత్య ఆసుపత్రి ప్రజా సంబంధాల అధికారులు రఫిక్, శ్రీకాంత్, దుర్గాప్రసాద్, ఆసుపత్రి సిబ్బంది అనిల్‌రావు, మహేష్, శ్రావణ్, రంజిత్, పూజ, అనూష, శృతి తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై వైద్య సేవలను వినియోగించుకున్నారు.


Comments