భూ వివాదం విషాదం.. మనస్తాపంతో మహిళ ఆత్మహత్య.
తల్లి మృతితో మల్యాల గ్రామంలో విషాద ఛాయలు.
ఇల్లందకుంట, జూలై 29 (తెలంగాణ ముచ్చట్లు):
భూ వివాదం కుటుంబంలో తీవ్ర విషాదానికి దారితీసిన ఘటన ఇల్లందకుంట మండలం మల్యాల గ్రామంలో చోటుచేసుకుంది. భూ తగాదా నేపథ్యంలో కుమార్తె చేతిలో అవమానానికి గురైన ఓ మహిళ మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా, చికిత్స పొందుతూ మృతి చెందింది.
పోలీసుల వివరాల ప్రకారం.. మల్యాల గ్రామానికి చెందిన చందగల్ల శంకరయ్య (66) తన చిన్న కుమార్తె రామంచ శైలజ (35), ఆమె భర్త ఆరోగ్యంపై ఇల్లందకుంట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. భూ వివాదం విషయంలో శైలజ తన తల్లి చందగల్ల లక్ష్మి (60)తో ఘర్షణకు దిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మిపై దాడి చేసి, ఇంటి వరకు ఈడ్చుకెళ్లినట్లు ఆరోపించారు.
ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన లక్ష్మి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను హుజూరాబాద్ ప్రభుత్వ సివిల్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి రిఫర్ చేశారు. అయితే చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఇల్లందకుంట ఎస్‌హెచ్‌ఓ క్రాంతి కుమార్ తెలిపారు. కుటుంబ కలహాలు చివరకు ప్రాణం తీసిన ఈ ఘటన మల్యాల గ్రామంలో విషాదాన్ని నింపింది.


Comments