సూరారంలో పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి.
17 మంది అరెస్ట్.. రూ.1.96 లక్షల నగదు, 4 కార్లు, బైక్, 19 సెల్‌ఫోన్లు స్వాధీనం.
ఎల్కతుర్తి, జూలై 25 (తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని సూరారం గ్రామ శివారులో రిలయన్స్ గ్యాస్ ప్లాంట్ సమీపంలో కొత్తగా నిర్మిస్తున్న ఫంక్షన్ హాల్‌లో పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు శనివారం రాత్రి మెరుపు దాడి నిర్వహించారు.
రాత్రి సుమారు 8 గంటల సమయంలో సీఐ పులి రమేష్, ఎస్సై నరసింహారావు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ఫంక్షన్ హాల్‌పై ఆకస్మికంగా దాడి చేయగా, 17 మంది పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి రూ.1,96,030 నగదు, 4 కార్లు, ఒక బైక్, 19 సెల్‌ఫోన్లు, 208 పేకముక్కలు, స్కోర్ కార్డు స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడిన వారిలో హుజురాబాద్, హనుమకొండ, పెద్దపల్లి, నెక్కొండ, కొడకండ్ల, శాయంపేట, హుస్నాబాద్ తదితర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పేకాట నిర్వహణకు స్థలాన్ని అందించిన ఫంక్షన్ హాల్ యజమాని శ్రీనివాస్పై కూడా కేసు నమోదు చేశారు.
పట్టుబడిన 17 మందితో పాటు ఫంక్షన్ హాల్ యజమానిపై సంబంధిత చట్టాల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల మెరుపు దాడితో పేకాట స్థావరం భగ్నమై భారీ మొత్తంలో నగదు, వాహనాలు, ఇతర సామగ్రి స్వాధీనం కావడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
ఈ దాడిలో సీఐ పులి రమేష్, ఎస్సై నరసింహారావుతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొని ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించారు.


Comments