జర్నలిస్టుల రైల్వే పాసులు పునరుద్ధరించాలి.
రైల్ నిలయం ఎదుట టీడబ్ల్యూజేఎఫ్ (హెచ్ 2843) ధర్నా.
*జర్నలిస్టుల రైల్వే పాసులు పునరుద్ధరించాలి*
*◆ రైల్ నిలయం ఎదుట టీడబ్ల్యూజేఎఫ్ (హెచ్ 2843) ధర్నా*
ఖమ్మం బ్యూరో, జూలై 24(తెలంగాణ ముచ్చట్లు )
జర్నలిస్టులకు రైల్వే రాయితీ పాసులను కేంద్ర ప్రభుత్వం వెంటనే పునరుద్ధరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) డిమాండ్ చేసింది. కరోనా సమయంలో నిలిపివేసిన రైల్వే పాసులను ఐదేళ్లుగా పునరుద్ధరించక పోవడంతో విధుల నిర్వహణలో పాత్రికేయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంది. ఈసారి వందశాతం రాయితీతో పాసులు మంజూరు చేయాలని కోరుతూ శుక్రవారం సికింద్రాబాద్ రైల్ నిలయం ఎదుట ఫెడరేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. అనంతరం దక్షిణ మధ్య రైల్వే డిప్యూటీ జనరల్ మేనేజర్ కె. కిరణ్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు.
ఫెడరేషన్ రాష్ట్ర యాక్టింగ్ ప్రెసిడెంట్ పి.రాంచందర్, ప్రధాన కార్యదర్శి బి.బసవ పున్నయ్య మాట్లాడుతూ, రైల్వే పాసులు లేకపోవడంతో స్థానిక, దేశీయ ప్రయాణాల్లో జర్నలిస్టులపై ఆర్థిక భారం పడుతోందన్నారు. కార్పొరేట్లకు భారీ రాయితీలు ఇస్తున్న కేంద్రం పాత్రికేయులకు గతంలో ఉన్న రైల్వే రాయితీని పునరుద్ధరించక పోవడం సరికాదన్నారు. కేంద్ర మంత్రులు, రైల్వే బోర్డు అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే వందశాతం రాయితీతో పాసులు ఇవ్వకపోతే దేశవ్యాప్తంగా జర్నలిస్టు సంఘాలతో కలిసి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
రైల్వే పాసుల పునరుద్ధరణపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు లేఖ రాయాలని ఫెడరేషన్ నేతలు కోరారు. ధర్నాలో ఉపాధ్యక్షులు గుడిగ రఘు, బి.రాజశేఖర్, కార్యదర్శి ఈ. చంద్రశేఖర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మేకల కృష్ణ, మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కార్యదర్శి రవినాయక్ తదితరులు పాల్గొన్నారు.


Comments