విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడొద్దు.. కేంద్రం పూర్తిగా బాధ్యత వహించాలి.
వనపర్తి బీఆర్ఎస్ నాయకుడు పానుగంటి సురేష్ కుమార్.
వనపర్తి,జూలై24(తెలంగాణ ముచ్చట్లు):
దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంపై వనపర్తి బీఆర్ఎస్ నాయకుడు పానుగంటి సురేష్ కుమార్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే జాతీయ స్థాయి పరీక్షల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం అత్యంత బాధాకరమని అన్నారు.పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. నీట్ పరీక్ష కోసం విద్యార్థులు ఎంతో కష్టపడి సిద్ధమవుతుంటే, పేపర్ లీకేజీల వల్ల వారి శ్రమ వృథా కావడంతో పాటు మానసిక ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడకుండా కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించి, ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.నీట్ పేపర్ లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని పానుగంటి సురేష్ కుమార్ డిమాండ్ చేశారు. జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణలో వరుసగా చోటుచేసుకుంటున్న లోపాలకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, విద్యార్థుల్లో నెలకొన్న ఆందోళనను తొలగించేలా కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పరీక్షల నిర్వహణలో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని, విద్యార్థులు నమ్మకంతో పరీక్షలు రాసేలా పారదర్శక వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. దేశ యువత భవిష్యత్తును కాపాడటం ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత అని పానుగంటి సురేష్ కుమార్ స్పష్టం చేశారు.


Comments