సమగ్ర ఓటరు నమోదు ప్రక్రియపై కాంగ్రెస్ విస్తృత స్థాయి సమీక్ష.
* బీఎల్‌ఏలు, కో-ఆర్డినేటర్లతో సమావేశమైన కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, వొడితల ప్రణవ్.
వీణవంక, జులై 24 (తెలంగాణ ముచ్చట్లు):
రాష్ట్రంలో కొనసాగుతున్న సమగ్ర ఓటరు నమోదు సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో శుక్రవారం హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కమలాపూర్, వీణవంక మండలాలకు చెందిన బీఎల్‌ఏలు, కో-ఆర్డినేటర్లతో విస్తృత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశంలో సుడా మాజీ ఛైర్మన్, హుజురాబాద్ ఎస్‌ఐఆర్ ఇన్‌చార్జి కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, హుజురాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ పాల్గొని బీఎల్‌ఏల పనితీరు, నమోదు ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలు, సందేహాలపై సమగ్రంగా చర్చించారు.
గ్రామాల వారీగా బీఎల్‌ఏల వద్ద ఉన్న సమాచారం పూర్తిగా కో-ఆర్డినేటర్ల వద్ద కూడా ఉండాలని వారు సూచించారు. ఓటరు నమోదు ఫారాలు గ్రామాల్లో అందుబాటులో లేకపోతే వెంటనే సంబంధిత బీఎల్‌ఓల ద్వారా కో-ఆర్డినేటర్లకు సమాచారం అందించాలని, ఆ వివరాలను పార్టీ నాయకత్వానికి చేరవేస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
సమగ్ర ఓటరు నమోదు ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రాధాన్యంతో పనిచేస్తోందని, ఈ అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుజురాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుని ప్రత్యేకంగా దృష్టి సారించారని పేర్కొన్నారు. అర్హత కలిగిన ఒక్క ఓటరు కూడా నమోదు కాకుండా మిగిలిపోకుండా కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో హుజురాబాద్, వీణవంక మండలా
లకు చెందిన కాంగ్రెస్ నాయకులు, బీఎల్‌ఏలు, కో-ఆర్డినేటర్లు, గ్రామస్థాయి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Comments