డ్యూటీలోనే కుప్పకూలిన ఫైర్ కానిస్టేబుల్..
వీణవంక, జులై 24 (తెలంగాణ ముచ్చట్లు):
కరీంనగర్ జిల్లా వీణవంక మండలానికి చెందిన మోటం అరవింద్ (తండ్రి: సారయ్య) జమ్మికుంట అగ్నిమాపక కేంద్రంలో ఫైర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రోజువారీ విధుల్లో భాగంగా గురువారం రాత్రి డ్యూటీకి హాజరైన అరవింద్, నైట్ షిఫ్ట్ కావడంతో ఫైర్ స్టేషన్‌లోనే విశ్రాంతి తీసుకుంటున్నాడు.
శుక్రవారం తెల్లవారుజామున సుమారు 4:30 గంటల సమయంలో అరవింద్‌కు ఒక్కసారిగా తీవ్ర ఛాతినొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన సహచర సిబ్బంది వెంటనే అప్రమత్తమై అంబులెన్స్‌లో జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే పరీక్షించిన వైద్యులు అప్పటికే అరవింద్ మృతి చెందినట్లు నిర్ధారించారు.
విధి నిర్వహణలో ఉండగానే యువ ఫైర్ కానిస్టేబుల్ ఆకస్మికంగా మృతిచెందడం అగ్నిమాపక శాఖలో తీవ్ర విషాదాన్ని నింపింది. అరవింద్ మరణవార్త తెలిసిన వెంటనే సహచర ఉద్యోగులు, కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. విధి పట్ల అంకితభావంతో పనిచేసే అరవింద్ అకాల మరణం స్థానికంగా కూడా విషాదాన్ని మిగిల్చింది. ఆయన మృతికి పలువురు అధికారులు, సహచరులు, ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు.


Comments