ఢిల్లీలో విద్యార్థులపై చర్యలకు నిరసనగా జమ్మికుంటలో బీఆర్ఎస్ భారీ ధర్నా.
జమ్మికుంట టౌన్ జులై 24 (తెలంగాణ ముచ్చట్లు):
ఢిల్లీలో విద్యార్థులు, యువతపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అణచివేత, దమనకాండకు నిరసనగా జమ్మికుంటలో మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్‌వీ నాయకులు, విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మాట్లాడుతూ, విద్యార్థులు, యువత స్వరాన్ని కేంద్ర ప్రభుత్వం అణిచివేయాలని ప్రయత్నించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. ఎన్నికల సమయంలో రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి యువతను నిరాశపరిచారని ఆరోపించారు.
"యువత కోరేది అధికారం కాదు... న్యాయం, భవిష్యత్తు మాత్రమే. విద్యార్థులపై నమోదైన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలి. దేశ భవిష్యత్తును నిర్మించే యువత మేల్కొంది.. కేంద్ర ప్రభుత్వం వారికి సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది" అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్‌వీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Comments