మోదీ నిరంకుశత్వానికి రాహుల్ గాంధీ అరెస్టే నిదర్శనం .

తుంబూరు దయాకర్ రెడ్డి.

మోదీ నిరంకుశత్వానికి రాహుల్ గాంధీ అరెస్టే నిదర్శనం .

- *విద్యార్థుల, నిరుద్యోగుల భవిష్యత్తుతో కేంద్రప్రభుత్వం చెలగాటమాడుతుందని మండిపాటు*

- *కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ప్రధాని మోదీ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్*

- *ఏదులాపురంలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం*

ఖమ్మం బ్యూరో, జులై 21(తెలంగాణ ముచ్చట్లు )

పోటీ పరీక్షల లీకేజీలతో దేశంలోని లక్షలాది మంది విద్యార్థుల, నిరుద్యోగ యువత జీవితాలను నాశనం చేస్తూ, వారి తరఫున ప్రశ్నిస్తున్న లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని అక్రమంగా అదుపులోకి తీసుకోవడం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసినందుకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

రాహుల్ గాంధీ అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తూ ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. సత్యనారాయణపురం రాంలీలా ఫంక్షన్ హాల్ నుండి ప్రధాన వీధుల గుండా ప్రదర్శనగా వెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఈ సందర్భంగా తుంబూరు దయాకర్ రెడ్డి మాట్లాడుతూ... పేపర్ లీకేజీల వల్ల కష్టపడి చదివిన విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతుంటే కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. బాధితుల పక్షాన నిలబడి న్యాయం చేయాలని ఆందోళన చేసిన రాహుల్ గాంధీపై పోలీసులు బలప్రయోగానికి దిగడం సిగ్గుచేటన్నారు. తక్షణమే ప్రధాని నరేంద్ర మోదీ, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని పట్టుబట్టారు. అరెస్టులకు, అక్రమ కేసులకు కాంగ్రెస్ శ్రేణులు భయపడేది లేదని, విద్యార్థులు, నిరుద్యోగుల హక్కుల సాధన కోసం రాహుల్ గాంధీ నాయకత్వంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, ఖమ్మం రూరల్ మండల, ఏదులాపురం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News