జాతీయస్థాయిలో ప్రతిభ చాటిన ఎల్కతుర్తి విద్యార్థులు.
ఎల్కతుర్తి, జూలై 21 (తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని ఇందిరానగర్‌లో గల శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థులు జాతీయస్థాయిలో తమ ప్రతిభను చాటుతూ మరోసారి ఘన విజయం సాధించారు. ప్రతి సంవత్సరం నిర్వహించే ప్రతిష్టాత్మక నాసా స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్‌లో పాల్గొన్న విద్యార్థులు జాతీయస్థాయిలో ద్వితీయ బహుమతిని కైవసం చేసుకున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ బండారి సంపత్ తెలిపారు.
విద్యార్థుల ఈ విజయాన్ని పురస్కరించుకొని పాఠశాలలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. విజేతలకు షీల్డ్‌లు, మెమెంటోలు అందజేసి ఘనంగా సత్కరించారు. విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల అంకితభావం, తల్లిదండ్రుల సహకారంతో ఈ విజయం సాధ్యమైందని ప్రిన్సిపల్ బండారి సంపత్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ చైతన్య విద్యాసంస్థల యాజమాన్యం విజేతలను అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించింది.
ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ శ్రీధర్, డీజీఎం చేతన్, ఏజీఎం పద్మాకర్, అకాడమిక్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్, అకాడమిక్ డీన్ తిరుపతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని విజేతలను అభినందించారు.


Comments