నీట్ లీకేజీపై కేంద్ర మంత్రిని రాజీనామా చేయించాలి.

విద్యార్థులపై లాఠీచార్జి ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘనే: సీపీఎం.

నీట్ లీకేజీపై కేంద్ర మంత్రిని రాజీనామా చేయించాలి.

సత్తుపల్లి, జూలై 21 (తెలంగాణ ముచ్చట్లు): 

నీట్ పరీక్ష పత్రాల లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని సీపీఎం సత్తుపల్లి పట్టణ కమిటీ డిమాండ్ చేసింది. పార్లమెంట్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించిన విద్యార్థులపై లాఠీచార్జి, భాష్పవాయువు ప్రయోగించడం ప్రజాస్వామ్య హక్కులపై దాడి అని మండిపడింది. ఈ మేరకు మంగళవారం స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు మోరంపూడి పాండురంగారావు, డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీట్ పరీక్షలో ప్రశ్నపత్రాల లీకేజీ అత్యంత తీవ్రమైన ఘటనగా అభివర్ణించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. న్యాయమైన డిమాండ్లతో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జి, భాష్పవాయువు ప్రయోగించడం కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. విద్యార్థుల గొంతు నొక్కే ప్రయత్నాలను ప్రజలు సహించరని హెచ్చరించారు. ఈ సందర్భంగా నీట్ పేపర్ లీకేజీపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సమగ్ర దర్యాప్తు చేపట్టాలని, లాఠీచార్జికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, దేశంలో పారదర్శకమైన, నమ్మకమైన పరీక్షా వ్యవస్థను ఏర్పాటు చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో సీపీఎం పట్టణ కార్యదర్శి కొలికపోగు సర్వేశ్వరరావు, ఎస్‌కే వలి, భాస్కర్, సైదా, జిలాని, వెంకటేశ్వరరావు, మీరాజ్, రామకృష్ణ, నబి, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు భాను, బాలాజీ, రఫీ, బాబు, జగన్, నాగరాజు, అజిత్, శేషు, పుల్లయ్య కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News