నీట్ పేపర్ లీకేజీ ఖండిస్తూ కాంగ్రెస్ ధర్నా.
నీట్ లీకేజీకి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి: కాంగ్రెస్.
హుజురాబాద్, జూలై 22(తెలంగాణ ముచ్చట్లు ):
నీట్ పేపర్ లీకేజీ ఘటనను ఖండిస్తూ హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం నిరసన ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సొల్లు బాబన్న, హనుమాన్ దేవస్థానం చైర్మన్ కొలిపాక శంకర్ నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులతో పాటు బీసీ జేఏసీ నాయకులు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, నీట్ పేపర్ లీకేజీ దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసిందని అన్నారు. పోటీ పరీక్షల నిర్వహణలో పారదర్శకత లోపించడం వల్ల విద్యార్థులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నీట్ లీకేజీకి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన చేపట్టిన విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. విద్యార్థులకు మద్దతుగా వెళ్లిన కాంగ్రెస్ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీల అరెస్టు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. విద్యార్థుల హక్కులను కాలరాసే చర్యలను వెంటనే నిలిపివేయాలని, పరీక్షల వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం కల్పించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ నాయకులు చందుపట్ల జనార్ధన్, సంధ్యల వెంకన్న, ఇబ్బకాయల సాగర్, ములుగు రాధ, ఎండి కరీమా, కుర్ర శ్రీనివాస్, సుంకరి రాజేందర్, కొత్తగట్టు చక్రపాణి, కొలిపాక సారయ్య, వేల్పుల రత్నం, పొడిసెట్టి వెంకటరాజం, తిప్పారపు భువనచందర్, పోగు సమ్మయ్య, ఎండి రియాజ్ తదితరులు పాల్గొన్నారు.


Comments