నర్సింగారావుపల్లిలో 13 ఏళ్ల తర్వాత మళ్లీ మోగిన బడి గంట .
పాఠశాలలో విద్యార్థులకు యూనిఫాంలు పంపిణీ
పాఠశాలను సందర్శించిన డిఈఓ
ధర్మసాగర్, జూలై 24(తెలంగాణ ముచ్చట్లు ):
గత 13 సంవత్సరాలుగా మూతపడి ఉన్న ధర్మసాగర్ మండలంలోని నర్సింగారావుపల్లి ప్రాథమిక పాఠశాల మళ్లీ విద్యార్థుల సందడితో కళకళలాడుతోంది. ఇటీవల పునఃప్రారంభమైన ఈ పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్.వి. గిరిరాజు గౌడ్ సందర్శించి విద్యార్థులకు యూనిఫాంలు పంపిణీ చేశారు. విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటిస్తూ వారి చదువు, హాజరు, పాఠశాల నిర్వహణపై వివరాలు తెలుసుకున్నారు.
ఈ పాఠశాల గత 13 సంవత్సరాలుగా మూతపడి ఉండగా, ప్రస్తుత విద్యా సంవత్సరంలో జూన్ 15న జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్.వి. గిరిరాజు గౌడ్, రిటైర్డ్ మండల విద్యాశాఖ అధికారి డాక్టర్ రామదాన్ ఆధ్వర్యంలో పునఃప్రారంభమైంది. గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు, ప్రజల సహకారంతో పాఠశాలలో 46 మంది విద్యార్థులను నమోదు చేసి తిరిగి విద్యా కార్యకలాపాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంలో గ్రామ ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి నాణ్యమైన విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేసిన గ్రామ ప్రజలు, ఉపాధ్యాయులను అభినందించారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి బి. శ్రీదేవి, పెద్దపెండ్యాల స్కూల్ కాంప్లెక్స్ అసిస్టెంట్ సెక్రటరీ బి. భగవాన్
రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు ఆర్. శ్యాంసుందర్ రెడ్డి, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


Comments