శివారాధనతో పుణ్యమయమైన తొలి ఏకాదశి .
ఎల్కతుర్తి, జూలై 25 (తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని వల్లభాపురం గ్రామంలో వెలసిన శ్రీ పశుపతినాథ్ దేవస్థానంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం భక్తిశ్రద్ధల నడుమ విశేష పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు సదానిరంజన్ సిద్ధాంతి ఆధ్వర్యంలో జరిగిన పూజల్లో గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తెల్లవారుజాము నుంచే ఆలయం భక్తులతో కిటకిటలాడగా, వేదమంత్రోచ్ఛారణల నడుమ పంచామృత రుద్రాభిషేకం, బిల్వార్చన, సామూహిక అర్చనలు భక్తిపూర్వకంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేసి స్వామివారి ఆశీర్వచనాలు అందించారు.
ఈ సందర్భంగా అర్చకులు సదానిరంజన్ సిద్ధాంతి మాట్లాడుతూ, తొలి ఏకాదశి రోజున పరమశివుని ఆరాధించడం వల్ల ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సుఖశాంతులు కలుగుతాయని తెలిపారు. రాష్ట్రంలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని శ్రీ పశుపతినాథ స్వామివారిని ప్రత్యేకంగా ప్రార్థించినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ భావన ఋషి, కోడం రమేష్, దగ్గు వెంకటేశ్వరరావు, ఉడుత నరసన్న, ఆంధ్రప్రభ ప్రవీణ్, రాకేష్, మహేందర్, తరుణ్, ఠాగూర్, రంజాన్, శ్రీనివాస్, సుశాంత్, విజయ, మమత, సౌందర్య, పూజ, ఆద్విక, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.


Comments