బీసీ హాస్టళ్లలో సీట్లు పెంచాలి.. సొంత భవనాలు నిర్మించాలి.
వసతుల లేమితో విద్యార్థుల ఇబ్బందులు.. ప్రభుత్వానికి బీసీ సంఘం విజ్ఞప్తి
హనుమకొండ, జులై 28 (తెలంగాణ ముచ్చట్లు):
ప్రభుత్వ బీసీ హాస్టళ్లలో సీట్ల సంఖ్యను పెంచడంతో పాటు అద్దె భవనాల్లో కొనసాగుతున్న హాస్టళ్లకు శాశ్వత సొంత భవనాలు నిర్మించాలని బీసీ ఆజాదీ స్టూడెంట్స్ ఫెడరేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా బీసీ సంక్షేమ అధికారి లక్ష్మణ్‌కు సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా బీసీ ఆజాదీ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కుడికాల బాస్కర్, రాష్ట్ర అధ్యక్షుడు పంజాల రేవంత్ గౌడ్ మాట్లాడుతూ హనుమకొండ జిల్లాలోని ప్రభుత్వ బీసీ హాస్టళ్లలో సీట్ల కొరత కారణంగా ప్రతి ఏడాది వందలాది మంది అర్హులైన బీసీ విద్యార్థులు హాస్టల్ ప్రవేశాలకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అనేక హాస్టళ్లు ఇప్పటికీ అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని, దీంతో విద్యార్థులకు సరైన వసతి, పరిశుభ్రత, భద్రత, తాగునీరు, నాణ్యమైన భోజనం, చదువుకు అనుకూలమైన వాతావరణం వంటి సౌకర్యాలు పూర్తిస్థాయిలో అందడం లేదని పేర్కొన్నారు.
బీసీ విద్యార్థుల విద్యాభివృద్ధి, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని అన్ని ప్రభుత్వ బీసీ హాస్టళ్లలో వెంటనే సీట్ల సంఖ్య పెంచాలని, అద్దె భవనాల్లో ఉన్న హాస్టళ్లకు సొంత భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు.
అలాగే హాస్టళ్లలో నాణ్యమైన భోజనం, స్వచ్ఛమైన తాగునీరు, మెరుగైన వసతులు, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, భద్రతా చర్యలు కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే స్పందించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో బీసీ ఆజాదీ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జినుకల లక్ష్మణ్‌రావు, శివకుమార్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.


Comments