సామాజిక న్యాయం, విద్యా సంక్షేమమే లక్ష్యం.
సాతూరి వెంకన్న మాదిగ.
ఎల్కతుర్తి, జూలై 27 (తెలంగాణ ముచ్చట్లు):
మాదిగ జాతి అభ్యున్నతి, సామాజిక న్యాయం, విద్యా సంక్షేమమే తన ప్రధాన లక్ష్యాలని ఎమ్మార్పీఎస్ నూతన జాతీయ ఉపాధ్యక్షులు సాతూరి వెంకన్న మాదిగ అన్నారు. హైదరాబాద్‌లో ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మేడి పాపయ్య మాదిగ అధ్యక్షతన జరిగిన జాతీయ కమిటీ ముఖ్య నాయకుల సమావేశంలో హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దామెర గ్రామానికి చెందిన సాతూరి వెంకన్న మాదిగను జాతీయ ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా నియమించారు. ఈ సమావేశానికి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
నియామకం అనంతరం సాతూరి వెంకన్న మాదిగ మాట్లాడుతూ తనపై విశ్వాసం ఉంచి జాతీయ ఉపాధ్యక్షుడి బాధ్యతలు అప్పగించిన ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మేడి పాపయ్య మాదిగ, రాష్ట్ర అధ్యక్షులు కేదాసి మోహన్ మాదిగతో పాటు సంస్థ నాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
మాదిగ జాతి హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం సాధన, విద్యా అవకాశాల విస్తరణ, యువత సాధికారత, సంక్షేమ కార్యక్రమాల బలోపేతం కోసం దేశవ్యాప్తంగా అంకితభావంతో పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు. జాతి అభ్యున్నతే ధ్యేయంగా ప్రతి కార్యకర్తతో కలిసి ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తానని స్పష్టం చేశారు. ఆయన నియామకంపై ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.


Comments