విద్యార్థుల భవిష్యత్తే రాష్ట్రానికి అసలైన పెట్టుబడి : మంత్రి పొంగులేటి.
- *రూ.4.85 కోట్లతో గొల్లగూడెం ఆశ్రమ పాఠశాల అభివృద్ధికి శంకుస్థాపన*
- *పేద పిల్లలకు కార్పొరేట్‌కు ధీటుగా నాణ్యమైన విద్య, వసతులు కల్పిస్తున్నామని వెల్లడి*
- *‘ఉద్దీపకం-3’ పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాసరెడ్డి*
ఖమ్మం బ్యూరో, జులై 29(తెలంగాణ ముచ్చట్లు )
“ప్రభుత్వ విద్యా రంగంలో చదివే పేద విద్యార్థులకు కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా నాణ్యమైన విద్యను, అత్యుత్తమ వసతులను అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. విద్యార్థుల భవిష్యత్తుపై పెట్టే ఖర్చే రాష్ట్రానికి అసలైన పెట్టుబడి” అని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
బుధవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గొల్లగూడెం ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో రూ.4.85 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి భూమిపూజ నిర్వహించారు.
- *కార్పొరేట్‌కు ధీటుగా సర్కారు బడులు*
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. సర్కారు బడులను నాణ్యమైన విద్యకు నిలయాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తోందన్నారు. గొల్లగూడెం ఆశ్రమ పాఠశాలలో అదనపు వసతి గృహం, డైనింగ్ హాల్, ఆధునిక వంటగది, అదనపు తరగతి గదులు, టాయిలెట్ బ్లాక్‌లు, సోలార్ ఫెన్సింగ్, ఓవర్ హెడ్ ట్యాంక్ వంటి మౌలిక వసతులు అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు. వీటి ద్వారా విద్యార్థినులకు పరిశుభ్రమైన, సురక్షితమైన విద్యా వాతావరణం లభిస్తుందన్నారు.
- *చదువే జీవితాన్ని మార్చే శక్తి*
తల్లిదండ్రులు పడే కష్టాన్ని గుర్తుంచుకుని విద్యార్థినులు ఉన్నత లక్ష్యాలను సాధించాలని మంత్రి పిలుపునిచ్చారు. “పేదరికం కారణంగా ఏ ఒక్కరి చదువు ఆగకూడదనేదే ప్రభుత్వ సంకల్పం. చదువు మాత్రమే మనిషి జీవితాన్ని, సమాజాన్ని మార్చగల శక్తి” అని ఆయన వ్యాఖ్యానించారు. ఉపాధ్యాయులు కూడా విద్యార్థులను తమ సొంత పిల్లల్లా భావించి, నాణ్యమైన విద్యతో పాటు మంచి నైతిక విలువలను అందించాలని సూచించారు. ఆశ్రమ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు శ్రద్ధ చూపుతున్న ఐటీడీఏ అధికారులను ఈ సందర్భంగా మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా ఐటీడీఏ రూపొందించిన ‘ఉద్దీపకం-3’ పుస్తకాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. విద్యార్థుల చదువు పూర్తయ్యాక ఉపాధి కల్పనలో మార్గదర్శకత్వం వహించేందుకు ‘వారధి’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని త్వరలోనే చేపట్టనున్నట్లు పీవో వెల్లడించారు. అనంతరం మంత్రి పాఠశాల విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.
ఈ కార్యక్రమంలో ఏదులాపురం మునిసిపాలిటీ చైర్‌పర్సన్ పోకబత్తిని అనిత, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, ఖమ్మం ఆర్డీవో ఎన్. శ్రీనివాస్, హౌజింగ్ పిడి భూక్యా శ్రీనివాస్, పీఆర్ ఇఇ మహేష్ బాబు, ఖమ్మం రూరల్ తహసీల్దార్ వినయ్ చంద్ర రెడ్డి, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.


Comments