రోడ్డు భద్రతపై విద్యార్థుల్లో చైతన్యం.. ప్రమాదాల నివారణే ధ్యేయం.
ఇల్లందకుంట, జూలై 29 (తెలంగాణ ముచ్చట్లు):
సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రత్యేక కమిటీ సూచనల మేరకు ఇల్లందకుంట మండల కేంద్రంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం రోడ్డు భద్రత అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు రోడ్డు నిబంధనలు, కుటుంబ భద్రత, సురక్షిత ప్రయాణంపై విస్తృతంగా అవగాహన కల్పించారు.
ముఖ్య అతిథిగా హాజరైన రోడ్ సేఫ్టీ ఇన్‌స్పెక్టర్ ఎన్. ధనరాజ్ గౌడ్ మాట్లాడుతూ జిల్లాలో రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించే వారు సీటు బెల్ట్ వినియోగించాలని సూచించారు. మద్యం సేవించి వాహనం నడపడం ప్రాణాంతకమని హెచ్చరిస్తూ, ప్రతి విద్యార్థి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని కోరారు.
డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రసాద్ మాట్లాడుతూ 18 సంవత్సరాల లోపు విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు నడపరాదని, ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు.
ఇల్లందకుంట ఎస్‌ఐ క్రాంతి కుమార్ మాట్లాడుతూ హెల్మెట్, సీటు బెల్ట్ వినియోగం ప్రాణాలను కాపాడే రక్షణ కవచాలని పేర్కొన్నారు. రోడ్డు భద్రత విషయంలో విద్యార్థులే మార్పుకు దూతలుగా మారాలని, కుటుంబ సభ్యులకు కూడా అవగాహన కల్పించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తస్మైన్ నస్మీన్, మండల విద్యాధికారి కె. రాములు, గ్రామ సర్పంచ్ దార సురేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


Comments