అంబేద్కర్ చౌరస్తాలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ ఎప్పుడూ?
*ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసి అక్రమ పార్కింగ్‌ను నియంత్రించాలని ప్రజల డిమాండ్*
హుజూరాబాద్, జూలై 17(తెలంగాణ ముచ్చట్లు ):
హుజూరాబాద్ పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఒకటైన అంబేద్కర్ చౌరస్తాలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు తీవ్రమవుతోంది. ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైన సిగ్నల్స్, దిశా నిర్దేశక బోర్డులు, హెచ్చరిక సూచికలు లేకపోవడంతో వాహనదారులు, పాదచారులు నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో రద్దీ ఎక్కువగా ఉండటంతో ట్రాఫిక్ పూర్తిగా అస్తవ్యస్తంగా మారి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
అంబేద్కర్ చౌరస్తా మీదుగా పట్టణంలోని ప్రధాన మార్కెట్, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు, వ్యాపార సముదాయాలకు వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. అయితే ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థ లేకపోవడంతో ఐదు వైపుల నుంచి వచ్చే వాహనాలు ఒకేసారి కూడలిలోకి చేరి ట్రాఫిక్ జామ్‌కు కారణమవుతున్నాయి. దీంతో వాహనదారులు విలువైన సమయాన్ని కోల్పోవడంతో పాటు చిన్నపాటి ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా పెరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.
రోడ్డు పక్కన కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలను ఇష్టానుసారంగా పార్కింగ్ చేయడం సమస్యను మరింత తీవ్రతరం చేస్తోంది. అక్రమ పార్కింగ్ కారణంగా రహదారి ఇరుకుగా మారి పెద్ద వాహనాలు, అత్యవసర సేవల వాహనాలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. పాదచారులకు సరైన మార్గం లేక రోడ్డుపైనే నడవాల్సి వస్తుండడంతో ప్రమాదాల ముప్పు పెరుగుతోంది.
ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు,m మహిళలు, వృద్ధులు రహదారి దాటేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు నిరంతరం విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని, ఆధునిక ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని, దిశా నిర్దేశక బోర్డులు, నో-పార్కింగ్ బోర్డులు ఏర్పాటు చేసి అక్రమ పార్కింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలని, రద్దీ సమయాల్లో ప్రత్యేక ట్రాఫిక్ సిబ్బందిని నియమించిన ట్రాఫిక్ సిగ్నల్ తో ఎక్కువ వాహనాలు అదుపులో ఉంటాయని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రమాదాలు జరగకముందే అధికారులు స్పందించి అంబేద్కర్ చౌరస్తాలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన రాకపోకలు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.


Comments