ఖమ్మం జిల్లాలో జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల జారీని వేగవంతం చేయాలి.
జిల్లా కలెక్టర్‌కు గ్రీవెన్స్ లో టిడబ్ల్యూజేఎఫ్
(హెచ్- 2843) వినతి.
జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నానబాల రామకృష్ణ,
అర్వపల్లి నగేష్.
ఖమ్మం బ్యూరో , ఆగస్టు 3(తెలంగాణ ముచ్చట్లు )
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల జారీ ప్రక్రియ పూర్తయి, అర్హులైన పాత్రికేయులకు ప్రభుత్వం అక్రిడేషన్ కార్డులను అందజేసినప్పటికీ, ఖమ్మం జిల్లాలో మాత్రం ఇప్పటికీ గణనీయ సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉండడం పట్ల తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ( టీ డబ్ల్యూ జె ఎఫ్–హెచ్ 2843) ఖమ్మం జిల్లా యూనియన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టీ.ఎస్ కి యూనియన్ ప్రతినిధులు గ్రీవెన్స్ లో వినతిపత్రం సమర్పించి, పెండింగ్‌లో ఉన్న అక్రిడేషన్ దరఖాస్తులను అత్యవసరంగా పరిష్కరించాలని కోరారు.
ఈ సందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు నానబాల రామకృష్ణ, అర్వపల్లి నగేష్ మాట్లాడుతూ, జర్నలిస్టులు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేస్తూ, నాలుగో స్తంభంగా ఉంటూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన బాధ్యతను నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, అధికార యంత్రాంగం చేపడుతున్న చర్యలను నిష్పాక్షికంగా ప్రజలకు చేరవేయడంలో పాత్రికేయులు విశేష సేవలు అందిస్తున్నారని తెలిపారు.
అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు, ఎన్నికలు, విపత్తులు, అంటువ్యాధులు, ప్రజా ఉద్యమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు వంటి ప్రతి సందర్భంలో తమ వ్యక్తిగత భద్రతను సైతం పక్కనపెట్టి ప్రజల కోసం నిరంతరం విధులు నిర్వహించే వృత్తి జర్నలిజమని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పనిచేసే జర్నలిస్టులకు ప్రభుత్వం గుర్తింపుగా అందించే అక్రిడేషన్ కార్డు కేవలం ఒక గుర్తింపు పత్రం మాత్రమే కాకుండా, వారి వృత్తిపరమైన సేవలకు ప్రభుత్వం ఇచ్చే గౌరవ సూచికమని అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో అక్రిడేషన్ కార్డుల జారీ పూర్తయినప్పటికీ ఖమ్మం జిల్లాలో ప్రక్రియ ఆలస్యం కావడం వల్ల అనేక మంది అర్హులైన జర్నలిస్టులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వ సమావేశాలు, అధికారిక కార్యక్రమాలు, వివిధ శాఖల సమాచార సేకరణ, ఇతర అధికారిక అవసరాల్లో అక్రిడేషన్ కార్డు కీలకంగా ఉపయోగపడుతుందని, ఆలస్యంతో వృత్తిపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయని వివరించారు. జర్నలిస్టులకు ప్రభుత్వం ప్రకటించే సంక్షేమ పథకాల అమలు, అధికారిక గుర్తింపు, వివిధ సందర్భాల్లో లభించే సౌకర్యాలు కూడా అక్రిడేషన్ కార్డుపైనే ఆధారపడి ఉంటాయని, అందువల్ల పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి అర్హులైన వారందరికీ కార్డులు జారీ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ( టీ డబ్ల్యూ జె ఎఫ్–హెచ్ 2843) ఖమ్మం జిల్లా యూనియన్ తరఫున జిల్లా కలెక్టర్ ను కోరుతూ, ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి, పెండింగ్‌లో ఉన్న అక్రిడేషన్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
ఖమ్మం జిల్లా కలెక్టర్ టి.ఎస్. దివాకర టి.ఎస్ ఈ అంశాన్ని సానుకూలంగా పరిగణించి, పెండింగ్‌లో ఉన్న జర్నలిస్టుల అక్రిడేషన్ దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించి, అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ప్రభుత్వం అందించే అక్రిడేషన్ కార్డులను త్వరితగతిన జారీ చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీ డబ్ల్యూ జె ఎఫ్–హెచ్ 2843) ఖమ్మం జిల్లా యూనియన్ విజ్ఞప్తి చేసింది. జర్నలిస్టుల సంక్షేమం, వృత్తి గౌరవం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ దృష్ట్యా ఈ సమస్యను అత్యంత ప్రాధాన్యతతో పరిగణించి తక్షణ చర్యలు తీసుకోవాలని యూనియన్ నాయకులు మరియు సభ్యులు కోరారు.
ఈ సందర్భంగా స్పందించిన కలెక్టర్ దివాకర్ టి.ఎస్ మీరు ఇచ్చిన వినతి పత్రాన్ని పరిగణలోకి తీసుకొని మీ అక్రిడేషన్ కార్డుల జారీ ని త్వరితగతిన పూర్తి అయ్యేలా చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో
టిడబ్ల్యూజేఎఫ్ హెచ్-2843 జిల్లా కోశాధికారి వేములకొండ రమేష్, స్టేట్ కౌన్సిల్ వెంబర్స్ సామ్రాట్ గుప్తా, నల్లా రాకేష్ రెడ్డి, ఉపాధ్యక్షులు కందరబోయిన నాగకృష్ణ,
కిరణ్, టీబీజేఎ జిల్లా కార్యదర్శి కాసోజు శ్రీధర్, వీడియో గ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షులు అమరబోయిన ఉపేందర్, సంయుక్త కార్యదర్శి కరుణాకర్ సుదగాని, నగర అధ్యక్షులు ఎలుగోటి వెంకట్, కార్యదర్శి కప్పల మధు గౌడ్, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అంతోటి శ్రీనివాస్, గుజ్జు గోపాలకృష్ణ, ఎలిసేట్టి రామకృష్ణ బాబు, బంక మధు తదితరులు పాల్గొన్నారు.


Comments