సహకార సంఘాలు రైతుల సొంతం.. రాజకీయ నేతల అడ్డాగా మార్చొద్దు
ఉమ్మడి కరీంనగర్, హనుమకొండ జిల్లాల అధ్యక్షుడు హింగే భాస్కర్ రావు.
ఎల్కతుర్తి, జూలై 21 (తెలంగాణ ముచ్చట్లు):
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు రైతుల సొంత సంస్థలని, వాటిని రాజకీయ నేతల అడ్డాగా మార్చే ప్రయత్నాలను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి కరీంనగర్, హనుమకొండ జిల్లాల అధ్యక్షుడు హింగే భాస్కర్ రావు డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల నిర్వహణలో రైతుల ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ రాజకీయ జోక్యాన్ని పెంచడం అత్యంత బాధాకరమని ఆయన అన్నారు. రైతుల ఆర్థికాభివృద్ధి, పంట రుణాలు, ఎరువులు, విత్తనాల పంపిణీ, ధాన్యం కొనుగోలు వంటి కీలక సేవలను అందించే సహకార సంఘాలు రైతుల సంక్షేమం కోసం పనిచేయాల్సి ఉండగా, వాటిని రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు.
సహకార సంఘాల పాలకవర్గాలను రైతులే స్వేచ్ఛగా ఎన్నుకునే అవకాశం కల్పించాల్సిన ప్రభుత్వం, నామినేటెడ్ పదవుల ద్వారా రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చాలని చూడడం ఖండనీయమని హింగే భాస్కర్ రావు అన్నారు. రైతుల సంక్షేమాన్ని పక్కనబెట్టి రాజకీయ నిరుద్యోగులకు పదవులు కట్టబెట్టే ధోరణిని వెంటనే విరమించుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
సహకార సంఘాలు రాజకీయాల కోసం కాకుండా రైతుల ప్రయోజనాల కోసం పనిచేయాలని, వాటి స్వయం ప్రతిపత్తిని పరిరక్షించాలని డిమాండ్ చేశారు. రైతుల అభిప్రాయాలను గౌరవిస్తూ పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించి, సహకార సంఘాల పాలన రైతుల చేతుల్లోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
రైతుల హక్కులకు భంగం కలిగించే ఏ నిర్ణయాన్నైనా తెలంగాణ రైతు రక్షణ సమితి తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులతో కలిసి ఉద్యమాలు చేపట్టేందుకు వెనుకాడబోమని హింగే భాస్కర్ రావు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వరికెల కిషన్ రావు, నాయకులు కొదరే మాధవరావు, సుధాకర్ రావు, శ్రీనివాస్, భాష, పోయిన కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


Comments