ఎమ్మెల్యే రాగమయి ప్రత్యేక దృష్టి.. ఎస్‌ఐఆర్‌లో సత్తుపల్లికి గుర్తింపు.
- ఖమ్మం జిల్లాలో రెండో స్థానంలో నిలిచిన నియోజకవర్గం.
- వేంసూరు మండలానికి ప్రథమ స్థానం.
- అధికారులు, బీఎల్ఓలు, బీఎల్ఏల సమిష్టి కృషికి ఫలితం.
సత్తుపల్లి, జూలై 30 (తెలంగాణ ముచ్చట్లు):
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం అమలులో సత్తుపల్లి నియోజకవర్గం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రెండో స్థానాన్ని దక్కించుకోగా, నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండలం ప్రథమ స్థానంలో నిలిచింది. స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ ప్రత్యేక దృష్టి సారించి చేపట్టిన అవగాహన కార్యక్రమాలు, అధికారులతో నిరంతర సమన్వయం, ఎప్పటికప్పుడు నిర్వహించిన సమీక్షల ఫలితంగానే ఈ ఘనత సాధ్యమైందని అధికారులు, ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంపై ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేలా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంతో పాటు రెవెన్యూ అధికారులకు అవసరమైన సూచనలు, మార్గనిర్దేశనం అందించారు. ఎంఆర్ఓ పర్యవేక్షణలో రెవెన్యూ అధికారులు, బీఎల్ఓలు, బీఎల్ఏలు సమన్వయంతో పనిచేస్తూ ఇంటింటికీ వెళ్లి నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించారు. అర్హత కలిగిన ఏ ఓటరూ నమోదు ప్రక్రియకు దూరం కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ విజయానికి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ నాయకత్వంతో పాటు ఎంఆర్ఓ సమర్థ పర్యవేక్షణ, రెవెన్యూ అధికారుల కృషి, బీఎల్ఓలు, బీఎల్ఏల అంకితభావం ప్రధాన కారణమని పేర్కొన్నారు. అలాగే సత్తుపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ దోమా ఆనంద్‌బాబు, వేంసూరు గ్రామ సర్పంచ్ ఎం.డి. ఫఖ్రుద్దీన్ అందించిన సహకారం, ప్రోత్సాహం కూడా కార్యక్రమం విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించిందని కొనియాడారు. ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగస్వాములైన ఎంఆర్ఓ, రెవెన్యూ అధికారులు, బీఎల్ఓలు, బీఎల్ఏలు, ప్రజాప్రతినిధులు, అలాగే నమోదు ప్రక్రియలో చురుకుగా పాల్గొన్న ప్రతి ఓటరికి ఎమ్మెల్యే ప్రత్యేక అభినందనలు తెలిపారు.


Comments