సత్తుపల్లిలోనే వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలి.
- విశ్రాంత ఉద్యోగుల సంఘం డిమాండ్.
- హెల్త్ కార్డులు, డీఏలు, పీఆర్సీ అమలుపై ప్రభుత్వానికి విజ్ఞప్తి.
సత్తుపల్లి, ఆగస్టు 1 (తెలంగాణ ముచ్చట్లు):
ఉద్యోగులు, పెన్షనర్లకు అందుబాటులో వైద్య సేవలు అందేలా సత్తుపల్లిలో వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. శనివారం సత్తుపల్లిలోని సంఘ భవనంలో అధ్యక్షుడు కేశవరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. సమావేశంలో కార్యదర్శి నివేదికను ప్రకాశరావు, ఆర్థిక కార్యదర్శి నివేదికను జి. కృష్ణయ్య ప్రవేశపెట్టారు. అనంతరం జరిగిన చర్చలో పలువురు సభ్యులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు ఒక వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేస్తామని ప్రకటించినప్పటికీ, సత్తుపల్లి ప్రాంత ప్రజల అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. జిల్లా కేంద్రం ఖమ్మం సత్తుపల్లికి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉందని, సత్తుపల్లి సబ్ ట్రెజరీ పరిధిలో వేలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు ఉన్నారని తెలిపారు. దూర ప్రాంతాల నుంచి ఖమ్మం వెళ్లడం ఇబ్బందికరంగా మారుతున్న నేపథ్యంలో సత్తుపల్లిలోనే వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేస్తే ఎక్కువ మందికి ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
*హెల్త్ కార్డులపై అయోమయం*
ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య పథకం అమలులో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై సమావేశంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. విధివిధానాలు పూర్తిగా ఖరారు కాకముందే జూన్ నెల నుంచి ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లలో 1.5 శాతం కోత విధిస్తున్నప్పటికీ, వైద్య సేవలు అందించే ఆసుపత్రుల విషయంలో ఇప్పటికీ స్పష్టత లేకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఆసుపత్రుల్లో చాలావరకు హెల్త్ కార్డులను అంగీకరించడం లేదని, ఇప్పటి వరకు ఉద్యోగులు, పెన్షనర్లకు హెల్త్ కార్డులు కూడా పూర్తిస్థాయిలో అందలేదని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న చర్చలు కూడా ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యామిలీ పెన్షనర్లు మాట్లాడుతూ తమకు వచ్చే పెన్షన్ స్వల్పంగా ఉండగా, అందులోనూ 1.5 శాతం కోత విధించడం ఆర్థిక భారంగా మారిందని తెలిపారు. ఫ్యామిలీ పెన్షనర్లకు ఉచిత వైద్య సేవలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
*డీఏలు, పీఆర్సీ అమలు చేయాలి*
ఉద్యోగులు, పెన్షనర్లకు రావలసిన ఆరు డీఏలను వెంటనే విడుదల చేయాలని సమావేశం డిమాండ్ చేసింది. అలాగే పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ నివేదికను వెంటనే స్వీకరించి అమలు ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే ఉద్యమ కార్యాచరణకు దిగాల్సి వస్తుందని సమావేశంలో హెచ్చరించారు. సమావేశంలో అధ్యక్షుడు కేశవరెడ్డి, కార్యదర్శి ప్రకాశరావుతో పాటు రామిశెట్టి సుబ్బారావు, అద్దంకి వెంకటరత్నం, ఎన్. నర్సయ్య, జి. కృష్ణయ్య, యోగానంద్, మహమూద్, కమలకుమారి, వాణి, సాంబశివరెడ్డి, బూరుగు దాసు, సుందరరావు, మధుసూదనరాజు తదితరులు పాల్గొన్నారు.


Comments