పరిమళ కాలనీ వాసులకు ఉచిత వైద్య సేవలు.
సీజనల్ వ్యాధులపై అవగాహన .
జమ్మికుంట టౌన్ ఆగస్టు 04 (తెలంగాణ ముచ్చట్లు):
కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అదనపు జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ సుధా రాజేంద్ర ఆధ్వర్యంలో జమ్మికుంట మండలం తనుగుల గ్రామపంచాయతీ పరిధిలోని పరిమళ కాలనీలో మంగళవారం సమగ్ర వ్యాధి ని
ర్ధారణ ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
ఈ శిబిరంలో లెప్రసీ, ఐసీటీసీ, ఎన్‌టీఈపీ విభాగాలతో పాటు వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య బృందం పాల్గొని హెచ్‌ఐవీ, హెపటైటిస్-బి, సిఫిలిస్, క్షయవ్యాధి, రక్తపోటు, మధుమేహం తదితర పరీక్షలు నిర్వహించి బాధితులకు వైద్య సలహాలు, కౌన్సెలింగ్ అందించారు. శిబిరాన్ని డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ ప్రభుదాస్ సందర్శించి వైద్య సేవలను పరిశీలించారు.
ఈ సందర్భంగా డాక్టర్ సుధా రాజేంద్ర మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండి సమగ్ర ఆరోగ్య పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకోవాలని సూచించారు. వర్షాకాలంలో మలేరియా, డెంగీ, చికున్‌గున్యా వంటి సీజనల్ వ్యాధుల నివారణకు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, ప్రతి వారం 'డ్రై డే' పాటించడం అవసరమని వివరించారు.
లెప్రసీ బాధితుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి వారికి అవసరమైన పాదరక్షలను పంపిణీ చేశారు. రక్తపోటు, మధుమేహంతో బాధపడుతున్న వారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా అందుబాటులో ఉన్న మందులనే వినియోగించాలని, అనారోగ్య సమస్యలు తలెత్తిన వెంటనే ప్రభుత్వ వైద్య సిబ్బందిని సంప్రదించి వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంఎల్‌హెచ్‌పీ డాక్టర్ కార్తీక్, డీపీఎంవోలు కృపలాదేవి, ప్రకాశ్‌రావు, సీహెచ్‌వో సదానందం, హెల్త్ ఎడ్యుకేటర్ పంజాల ప్రతాప్ గౌడ్, ఏఎన్‌ఎంలు మనీ, రజిత, ఐసీటీసీ కౌన్సిలర్ మహిపాల్, ల్యాబ్ టెక్నీషియన్ ఇబ్రహీం, టీబీ స్క్రీనర్ శ్రీనివాస్, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Comments