ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి.
ఖాజా హుస్సేన్,ఎన్ హెచ్ఎం జేఏసీ జిల్లా కోఆర్డినేటర్.
వనపర్తి,ఆగస్టు04(తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ రాష్ట్రంలో ప్రజారోగ్య సేవలను నిరంతరం అందిస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం అత్యవసరంగా పరిష్కరించాలని ఎన్‌హెచ్‌ఎం జేఏసీ జిల్లా సమన్వయకర్త ఖాజా హుస్సేన్ మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయడంతో పాటు, ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు జమయ్యేలా శాశ్వత వ్యవస్థను అమలు చేయాలని కోరారు.గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు అంకితభావంతో సేవలందిస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు నేటికీ అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. వేతనాల చెల్లింపులో తరచూ జాప్యం జరుగుతుండటంతో ఉద్యోగులు, వారి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. గతంలో కూడా పెండింగ్ వేతనాలు, ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశాలపై పలుమార్లు ఆందోళనలు చేపట్టిన విషయాన్ని గుర్తుచేశారు.వైద్యుల నుంచి కాంటింజెంట్ ఉద్యోగుల వరకు సుమారు 17 వేల మంది ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను, 78 కేడర్లలో పనిచేస్తున్న వారందరినీ ఎలాంటి షరతులు లేకుండా క్రమబద్ధీకరించాలని ఖాజా హుస్సేన్ డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత, హక్కులు, సంక్షేమానికి సంబంధించిన అన్ని సమస్యలకు ప్రభుత్వం తక్షణ పరిష్కారం చూపాలని కోరారు.ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం అహర్నిశలు సేవలందిస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల పట్ల ప్రభుత్వం న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే సానుకూల నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు.ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు సిద్ధంగా ఉన్నామని ఖాజా హుస్సేన్ హెచ్చరించారు. ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.


Comments