ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి.. బీఆర్ఎస్‌కు పెరుగుతున్న ఆదరణ: కౌశిక్ రెడ్డి.
*పక్క చూపులు చూసేవారు పార్టీని వీడొచ్చు.. బీఆర్ఎస్ శ్రేణులకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హెచ్చరిక*
హుజూరాబాద్, ఆగస్టు 5 (తెలంగాణ ముచ్చట్లు):
ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని, బీఆర్ఎస్ పార్టీ పట్ల సానుభూతి పెరుగుతోందని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. బుధవారం హుజూరాబాద్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకుల సమన్వయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సమావేశానికి ముందు ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికు నాయకులు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ, త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో విజయం సాధించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో పార్టీ సభ్యత్వ నమోదు, బూత్ స్థాయి కమిటీల బలోపేతంపై దృష్టి సారించాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి వాటిని అమలు చేయకపోవడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని ఆరోపించారు. ఇలాంటి సమయంలో ఇతర పార్టీల నాయకులతో, ముఖ్యంగా ఈటల రాజేందర్తో రహస్యంగా సంబంధాలు కొనసాగించే వారు ఉంటే పార్టీని వీడవచ్చని హెచ్చరించారు. పార్టీ కోసం నిజాయితీగా, నిబద్ధతతో పనిచేసే వారికే గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు.
ప్రస్తుత వ్యవసాయ సీజన్‌లో రైతులు ఎదుర్కొంటున్న యూరియా కొరత, సాగునీటి సమస్యలు, పంటల పరిస్థితిపై నాయకులతో చర్చించారు. రైతులకు అవసరమైన యూరియా అందుబాటులో ఉందా, ఏ ప్రాంతాల్లో సాగునీటి సమస్యలు ఉన్నాయో అడిగి తెలుసుకుని, రైతుల సమస్యలను వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఎస్‌ఐఆర్ ప్రక్రియలో పాల్గొన్న ఏజెంట్లకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే, స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని, ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో రాష్ట్ర నాయకుడు బండి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, మండల అధ్యక్షుడు సంగెం ఐలయ్య, సింగిల్ విండో అధ్యక్షుడు ఏడవెల్లి కొండల్ రెడ్డి, కౌన్సిలర్లు గందే శ్రీనివాస్, వర్దినేని రవీందర్ రావు, ప్రతాప్ తిరుమల రెడ్డి, పార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments