కూతురి కాపురం కోసం తండ్రి చేసిన ప్రయత్నం విషాదాంతం.
వీణవంక, ఆగస్టు 08 (తెలంగాణ ముచ్చట్లు):
అదనపు కట్నం కోసం కుమార్తెను వేధిస్తున్న అల్లుడు, అత్తమామల తీరుతో మనస్తాపానికి గురైన తండ్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందింది.
చల్లూరు గ్రామానికి చెందిన రామిడి వెంకటమ్మ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. ఆమె కుమార్తెకు 2018లో అదే గ్రామానికి చెందిన లంబు శ్రీమాణికుమార్‌తో వివాహం జరిగింది. వివాహ సమయంలో కట్నంగా ఎకరం 20 గుంటల భూమితో పాటు బంగారం, ఇతర సామగ్రి ఇచ్చినట్లు తెలిపారు. వారికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారని పేర్కొన్నారు.
గత మూడు, నాలుగు సంవత్సరాలుగా తన అల్లుడు మరో మహిళతో సంబంధం పెట్టుకుని కుమార్తెను శారీరకంగా, మానసికంగా వేధించేవాడని ఆరోపించారు. అదనంగా రూ.5 లక్షల కట్నం తీసుకురావాలని అల్లుడితో పాటు అతని తల్లి, తండ్రి వేధించేవారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వేధింపులు భరించలేక తన కుమార్తె గత రెండేళ్లుగా తమ ఇంటి వద్దే ఉంటోందని తెలిపారు.
ఈ సమస్య పరిష్కారం కోసం జూలై 29న గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించినట్లు తెలిపారు. ఆ సమయంలో తన భర్త సంజీవరెడ్డి అల్లుడు, అతని తల్లిదండ్రులను వేడుకుని తమ కుమార్తెను తిరిగి కాపురానికి తీసుకెళ్లాలని కోరినప్పటికీ వారు నిరాకరించారని పేర్కొన్నారు. పైగా తన భర్తను అవమానించేలా మాట్లాడారని ఆరోపించారు.
తరువాత ఆగస్టు 3న కూడా తన భర్త అల్లుడి ఇంటికి వెళ్లి కుమార్తెను కాపురానికి తీసుకెళ్లాలని వేడుకున్నారని, అక్కడ అల్లుడు, అతని తల్లిదండ్రులు మరోసారి అవమానించి కొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన తన భర్త అదే రోజు రాత్రి ఇంట్లో పురుగుల మందు తాగినట్లు తెలిపారు.
వెంటనే కుటుంబ సభ్యులు, బంధువులు 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆగస్టు 7న రాత్రి మృతి చెందినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
తన కుమార్తెను అదనపు కట్నం కోసం వేధించడంతో పాటు తన భర్త ఆత్మహత్యకు కారణమయ్యారని ఆరోపిస్తూ అల్లుడు లంబు శ్రీమాణికుమార్, అతని తల్లి మురోగతి, తండ్రి మల్లారెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రామిడి వెంకటమ్మ పోలీసులను కోరారు.


Comments