రైతులకు సాగునీరు విడుదల చేయాలి.
బీఆర్ఎస్ హెచ్చరికలతోనే పంపులు ప్రారంభించారు
-- పెద్దమందడిలో బీఆర్ఎస్ నాయకుల ధ్వజం
పెద్దమందడి,ఆగస్టు08(తెలంగాణ ముచ్చట్లు):
కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోని ఎల్లూరు, జొన్నలబొగడ, గుడిపల్లి జలాశయాల నుంచి వెంటనే సాగునీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని పెద్దమందడి మండల బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలోని శ్రీనివాస కళ్యాణ మండపంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.మాజీ జిల్లా రైతుబంధు అధ్యక్షుడు జగదీశ్వర్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వేణుయాదవ్, శ్రీనివాస్ గౌడ్ అల్వాల వెంకటరెడ్డి తదితరులు మాట్లాడుతూ.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిని విమర్శించే నైతిక హక్కు ఎమ్మెల్యే మేఘారెడ్డికి లేదన్నారు. ప్రాజెక్టులు, సాగునీటి అంశాలపై అవగాహన లేకుండా ఎమ్మెల్యే ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు.కల్వకుర్తి ఎత్తిపోతల పథకం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సాధించిన విజయమని పేర్కొన్నారు. జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో ఎల్లూరు, జొన్నలబొగడ, గుడిపల్లి జలాశయాలను నింపి రైతులకు సాగునీరు అందించాలని కోరారు.బీఆర్ఎస్ నాయకులు నార్లాపూర్ జలాశయ ముట్టడికి హెచ్చరించిన తర్వాతే ప్రభుత్వం పంపులు ప్రారంభించిందని ఆరోపించారు. అయితే ఇప్పటికీ గుడిపల్లి జలాశయం నుంచి కాలువలకు నీరు విడుదల చేయలేదని, జొన్నలబొగడలో ఒక్క పంపు మాత్రమే పనిచేస్తోందని తెలిపారు. రైతులకు సాగునీరు అందించకుండా కేవలం తాగునీటి అవసరాల కోసం జలాశయాలను నింపే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పరిధిలోని 500 చెరువులు, కుంటలను వెంటనే నింపి వానాకాలం, యాసంగి పంటలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. పంపులను సుమారు 200 రోజుల పాటు నడిపే అవకాశం ఉన్నందున ప్రభుత్వం ఇప్పటికైనా చిత్తశుద్ధితో వ్యవహరించాలని కోరారు. రైతులకు నీరు అందించకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు సేనాపతి వెంకటయ్య, మనీగిళ్ల సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, అల్వాల వెంకటరెడ్డి, చిత్తూరు కృష్ణారెడ్డి, భాస్కర్‌రెడ్డి, ఆంజనేయులు, మలక్ సురేష్, రఘువర్ధన్‌రెడ్డి, భాస్కర్ రెడ్డి, రమేష్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు.


Comments