వివాహేతర బంధానికి అడ్డుగా ఉందని.. అత్తను హతమార్చారు!
- అర్ధరాత్రి ఇంట్లోకి వెళ్లి చీరకొంగుతో గొంతు బిగించి హతమార్చిన నిందితులు.
- మృతదేహాన్ని పెట్రోల్‌తో దహనం చేసేందుకు రెండుసార్లు యత్నం.
- 65 ఏళ్ల వృద్ధురాలి హత్య కేసులో ఇద్దరి అరెస్టు.. రిమాండ్‌కు తరలింపు.
సత్తుపల్లి, ఆగస్టు 9 (తెలంగాణ ముచ్చట్లు):
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందనే కక్షతో అత్తను హత్య చేసి.. ఆనవాళ్లు లేకుండా చేసేందుకు మృతదేహాన్ని పెట్రోల్‌తో దహనం చేసిన ఘటన సత్తుపల్లి మండలంలో వెలుగుచూసింది. తుంబూరు గ్రామానికి చెందిన గుండాల వెంకట నర్సమ్మ (65)ను హత్య చేసిన కేసులో ఇద్దరు నిందితులను సత్తుపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం నారాయణపురం–గురుభట్లగూడెం ఎక్స్‌రోడ్డు వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు.
*కనిపించకుండా పోయిన వృద్ధురాలు*
తుంబూరు గ్రామానికి చెందిన గుండాల వెంకట నర్సమ్మ ఈ నెల 2న రాత్రి నుంచి కనిపించకుండా పోయింది. దీంతో ఆమె పెద్ద కుమార్తె వెదుళ్ల మంగమ్మ ఫిర్యాదు మేరకు ఆగస్టు 4న సత్తుపల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.
కేసు దర్యాప్తును సత్తుపల్లి సీఐ టి. శ్రీహరి చేపట్టారు. వైరా ఏసీపీ, కల్లూరు ఇన్‌చార్జి ఏసీపీ సాదుల సారంగపాణి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు.
*వివాహేతర బంధమే కారణం*
పోలీసుల వివరాల ప్రకారం.. తుంబూరుకు చెందిన వెదుళ్ల తిరుపతిరావు (55)కు ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్యకు దూరంగా ఉంటూ రెండో భార్య మంగమ్మతో తుంబూరులో నివసిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన భర్తను కోల్పోయిన పగుట్ల సునీత (35)తో కొంతకాలంగా తిరుపతిరావు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయం తిరుపతిరావు భార్య మంగమ్మ, ఆమె తల్లి వెంకట నర్సమ్మకు తెలియడంతో కుటుంబంలో తరచూ గొడవలు జరిగేవి. జూలై 30న దుద్దేపూడిలో సునీత పనిచేస్తున్న ఇంటి వద్దకు మంగమ్మ, వెంకట నర్సమ్మ వెళ్లి ఆమెను మందలించడంతో పాటు కొట్టినట్లు విచారణలో వెల్లడైంది. దీంతో అవమానానికి గురైన సునీత.. తమ సంబంధానికి అడ్డుగా ఉన్న వెంకట నర్సమ్మను హతమార్చాలని తిరుపతిరావుతో కలిసి పథకం వేసినట్లు పోలీసులు తెలిపారు.
*అర్ధరాత్రి ఇంట్లోకి వెళ్లి..*
పథకం ప్రకారం ఆగస్టు 2న అర్ధరాత్రి 12 గంటల సమయంలో తిరుపతిరావు, సునీత కలిసి వెంకట నర్సమ్మ ఇంటికి వెళ్లారు. తలుపు తెరిచి ఉండటంతో లోపలికి ప్రవేశించారు. ఆ సమయంలో వెంకట నర్సమ్మ కుర్చీలో కూర్చొని టీవీ చూస్తోంది. ఇద్దరూ కలిసి ఆమె చీర కొంగును మెడకు బిగించి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
*మృతదేహాన్ని పెట్రోల్‌తో దహనం*
హత్య అనంతరం మృతదేహాన్ని తిరుపతిరావు తన మోటార్‌సైకిల్‌పై మధ్యలో కూర్చోబెట్టుకున్నాడు. సునీత వెనుక కూర్చుంది. నారాయణపురం ఆంజనేయస్వామి ఆలయం దాటిన తర్వాత రోడ్డు పక్కన ఉన్న ఎండిపోయిన కట్టెలు, కొబ్బరి మట్టలు, చెత్తలో మృతదేహాన్ని పడేశారు. అనంతరం మోటార్‌సైకిల్‌లోని పెట్రోల్‌ను బాటిల్‌లోకి తీసుకుని మృతదేహంపై పోసి నిప్పంటించినట్లు పోలీసులు తెలిపారు. మరుసటి రోజు ఉదయం అక్కడికి వెళ్లి చూడగా మృతదేహం పూర్తిగా కాలకపోవడంతో మరిన్ని కొబ్బరి మట్టలు, చెత్తను దానిపై వేసి వెళ్లిపోయారు. ఆగస్టు 3న రాత్రి మరోసారి అక్కడికి వెళ్లి పరిశీలించగా శరీర భాగాలు మిగిలి ఉండటంతో వాటిని ఆకుపచ్చ రంగు గుడ్డ మ్యాట్‌లో చుట్టి కొద్దిదూరంలోని మరో ప్రాంతానికి తరలించారు. అక్కడ కూడా కట్టెలు, కొబ్బరి మట్టలు, చెత్తలో వేసి రెండు బాటిళ్లలో తెచ్చిన పెట్రోల్ పోసి తగులబెట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది.
*గ్రామ పెద్దకు చెప్పి.. పరారీ*
హత్య చేసిన విషయాన్ని తిరుపతిరావు తుంబూరు సర్పంచ్ వీరబాబు, జీపీఓ ఎక్కిరాల లక్ష్మణ్‌కు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. తనను కాపాడాలని కోరగా.. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి విషయం చెబుదామని, భయపడాల్సిన అవసరం లేదని వారు చెప్పినట్లు పేర్కొన్నారు. అనంతరం ఇంటికి వెళ్లి వస్తానని చెప్పిన తిరుపతిరావు అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. కేసులో తుంబూరుకు చెందిన వెదుళ్ల తిరుపతిరావు (55), పగుట్ల సునీత (35)ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితులు ఉపయోగించిన మోటార్‌సైకిల్, ఇద్దరి సెల్‌ఫోన్లు, మృతురాలి బ్యాటరీ, సిమ్, వెనుక కవర్ లేని సెల్‌ఫోన్, రెండు ఖాళీ పెట్రోల్ బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
*ప్రత్యేక బృందాలతో దర్యాప్తు*
సత్తుపల్లి సీఐ టి. శ్రీహరి ఆధ్వర్యంలో ఎస్‌ఐలు వీరప్రసాద్, ప్రదీప్, పోలీస్‌స్టేషన్ సిబ్బంది దర్యాప్తులో పాల్గొన్నారు. వైరా ఏసీపీ, కల్లూరు ఇన్‌చార్జి ఏసీపీ సాదుల సారంగపాణి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.


Comments