పేరుకే 100 పడకల ఆసుపత్రి.

*పూర్తిస్థాయి వైద్య సేవలు, సిబ్బంది, పరికరాలు అందుబాటులోకి తేవాలి: మహేందర్ జీ.

పేరుకే 100 పడకల ఆసుపత్రి.

హుజురాబాద్, ఆగస్టు 8(తెలంగాణ ముచ్చట్లు ):

హుజురాబాద్ పట్టణంలోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని బహుజన్ సమాజ్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు గిన్నారపు మహేందర్ డిమాండ్ చేశారు. ఆసుపత్రికి వంద పడకల హోదా ఉన్నప్పటికీ అందుకు అనుగుణంగా వైద్యులు, వైద్య సిబ్బంది, అవసరమైన పరికరాలు, మందులు అందుబాటులో లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో ఇరవై నాలుగు గంటల గంటల అత్యవసర వైద్య సేవలు సమర్థవంతంగా అందేలా అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని మహేందర్ కోరారు. ముఖ్యంగా విషపదార్థాలు సేవించిన వారు, ప్రమాదాలు, ఇతర అత్యవసర కేసులతో ఆసుపత్రికి వచ్చే రోగులను అవసరం లేకపోయినా ఇతర ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారనే ఆరోపణలు రోగులు, వారి బంధువుల నుంచి వినిపిస్తున్నాయని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన వారికి అక్కడే తగిన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న రోగులు
ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్య సేవలు అందడం లేదని కొందరు రోగులు, వారి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని మహేందర్ తెలిపారు. చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చినప్పటికీ తగిన వైద్యం అందకపోవడంతో, ఆసుపత్రిలో చికిత్స పొందలేమని పేర్కొంటూ సంతకాలు చేసి బయటకు వెళ్లి ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోందని కొందరు రోగుల బంధువులు ఆరోపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
అదేవిధంగా ఆసుపత్రి సిబ్బంది కొందరు రోగులతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని, ఈ ఆరోపణలపై సంబంధిత ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని మహేందర్ డిమాండ్ చేశారు.
గర్భిణులు, చిన్నారులకు మెరుగైన సేవలు అందించాలి
ఆసుపత్రిలో స్కానింగ్, ల్యాబ్ వంటి సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ, కొన్ని పరీక్షల కోసం రోగులను బయటకు పంపిస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని మహేందర్ తెలిపారు. ముఖ్యంగా గర్భిణులు, చిన్నారులకు అవసరమైన పరీక్షలు, వైద్య సేవలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే పూర్తిస్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రభుత్వ ఆసుపత్రులు పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రధాన ఆధారమని, ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితి రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. వంద పడకల ఆసుపత్రికి అవసరమైన వైద్యులు, సిబ్బంది, పరికరాలు, మందులు సమకూర్చి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.
హుజురాబాద్ ప్రజలకు నాణ్యమైన ప్రభుత్వ వైద్యం అందే వరకు ఈ సమస్యలపై ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశ్నిస్తూనే ఉంటామని గిన్నారపు మహేందర్ స్పష్టం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News