ఎరుకల నాయకుడి అవమానాన్ని సహించం.
మంగరాయి వెంకటేష్ రాజ్యాధికార పార్టీ దేవరకద్ర ఇంచార్జ్.
మహబూబ్‌నగర్,ఆగస్టు08(తెలంగాణ ముచ్చట్లు):
ఎరుకల జాతి నాయకుడు, ఎల్‌బీనగర్ మన్సూరాబాద్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బుడ్డా సత్యనారాయణను, ఆయన కుటుంబ సభ్యులను కులపరంగా కించపరిచేలా దూషించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జక్కిడి ప్రభాకర్‌రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ దేవరకద్ర నియోజకవర్గ ఇన్‌చార్జి మంగరాయి వెంకటేష్ శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.శనివారం ఆయన మాట్లాడుతూ.. ఈ ఘటనకు సంబంధించినదిగా పేర్కొంటున్న ఆడియో వెలుగులోకి రావడం ఆందోళన కలిగించే విషయమన్నారు. కులపరంగా అవమానించేలా మాట్లాడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై సమగ్ర విచారణ జరిపి, ఆరోపణలు నిజమైతే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వెంటనే స్పందించి, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కుల వివక్షను ప్రజాస్వామ్య సమాజం సహించదని అన్నారు.ఏకలవ్యుడి కాలం నుంచి నేటి వరకు ఎరుకల జాతి ప్రజలు సామాజిక, రాజకీయ వివక్షను ఎదుర్కొంటున్నారని మంగరాయి వెంకటేష్ అన్నారు. ఎరుకల సమాజానికి రాజకీయంగా తగిన ప్రాతినిధ్యం కల్పించాలని, చట్టసభలు, నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని, రాజకీయ పార్టీలను కోరారు.ఈ ఘటనపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, కేసును నీరుగార్చే ప్రయత్నం జరిగితే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని మంగరాయి వెంకటేష్ హెచ్చరించారు.


Comments