కేంద్ర విధానాలపై ప్రజా సంఘాల పోరుబాట.
ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జమ్మికుంటలో జైల్‌భరో.
జమ్మికుంట, టౌన్ ఆగస్టు 10 (తెలంగాణ ముచ్చట్లు):
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సోమవారం జమ్మికుంట పట్టణంలోని గాంధీచౌక్‌లో రాస్తారోకో, జైల్‌భరో కార్యక్రమం నిర్వహించారు. ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఐటీయూ మండల కార్యదర్శి జక్కుల రమేష్ యాదవ్, రైతు సంఘం మండల కార్యదర్శి కాయిత లింగారెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు పన్నెండేళ్లు గడిచినా కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికుల సమస్యలు పరిష్కారం కాలేదని విమర్శించారు.
కార్మికుల హక్కులను కాలరాసే విధంగా గతంలో ఉన్న 44 కార్మిక చట్టాలను కుదించి నాలుగు కార్మిక కోడ్‌లుగా మార్చారని ఆరోపించారు. కార్పొరేట్, ప్రైవేటు సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తూ కార్మికుల హక్కులను హరించే విధానాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందని విమర్శించారు.
రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే విధానాలను కేంద్రం అవలంబిస్తోందని నాయకులు ఆరోపించారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు సుదీర్ఘకాలం ఉద్యమించిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఇప్పటికీ పూర్తిస్థాయిలో అమలు చేయలేదన్నారు. వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేయాలని రాష్ట్రాలపై ఒత్తిడి చేయడంతోపాటు యూరియా, డీఏపీ కొరత, ధరల పెరుగుదలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
పేద రైతులు, వ్యవసాయ కార్మికులకు అండగా ఉన్న ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కొత్త విధానంతో రాష్ట్రాలపై అధిక ఆర్థిక భారం మోపుతున్నారని, దీంతో పేదలు, వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ పథకం ప్రయోజనాలు దూరమయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
దేశంలోని సంపన్న వర్గాలు, కార్పొరేట్ సంస్థలకు భారీ రాయితీలు కల్పిస్తూ పేద, బడుగు, బలహీన వర్గాల సమస్యలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీని కూడా అమలు చేయలేదని ఆరోపించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజా వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకుని రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు, పేదలు, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దేశవ్యాప్తంగా మరింత విస్తృతమైన నిరంతర పోరాటాలు నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
కార్యక్రమంలో రైతు సంఘం నాయకుడు దండిగారి సతీష్, కేవీపీఎస్ నాయకుడు వడ్లూరి కిషోర్, సీఐటీయూ నాయకులు కన్నం సదానందం, గారే రాజకుమారి, రావుల ఓదెలు, క్రాంతికుమార్, రాచపల్లి తిరుపతి, తాటికంటి రంజిత్, తూర్పాటి నాగరాజు, జీడి సదానందం తదితరులు పాల్గొన్నారు.


Comments