సవాల్ విసిరితే బీఆర్‌ఎస్ నాయకులు ఎక్కడ?
బుద్ధారం వద్దకు వచ్చి నీటి ప్రవాహాన్ని కళ్లారా చూడాలి
-- కొత్త కాపు వెంకటేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు
పెద్దమందడి,ఆగస్టు10(తెలంగాణ ముచ్చట్లు):
శ్రీశైలం–కేఎల్‌ఐ ద్వారా నీళ్లు రావడం లేదంటూ బీఆర్‌ఎస్ నాయకులు చేస్తున్న ప్రచారంపై పెద్దమందడి–ఖిల్లా ఘనపూర్ మండలాల మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం రైతులు, ప్రజలను గందరగోళానికి గురిచేసేలా తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు.కేఎల్‌ఐ నీటి ప్రవాహంపై వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు బీఆర్‌ఎస్ నాయకులను బహిరంగంగా సవాల్ చేసినట్లు వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. బుద్ధారం గండి లేదా చెరువు వద్దకు వచ్చి నీటి ప్రవాహాన్ని కళ్లారా పరిశీలించాలని కోరినా ఇప్పటివరకు వారి నుంచి స్పందన లేదన్నారు. నీళ్లు రావడం లేదంటూ ఆరోపణలు చేస్తున్న నాయకులు క్షేత్రస్థాయికి వచ్చి వాస్తవాలను పరిశీలించేందుకు ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు.కేవలం ప్రెస్‌మీట్లు పెట్టి ఆరోపణలు చేయడం కాకుండా రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. వాస్తవాలను తెలుసుకోకుండా తప్పుడు ప్రచారం చేయడం వల్ల రైతుల్లో అనవసరమైన ఆందోళన, గందరగోళం ఏర్పడుతుందని అన్నారు.ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సాగునీటి సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ అధికారులతో నిరంతరం సమన్వయం చేస్తున్నారని వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. నీటి విషయంలో ఎవరికైనా అనుమానాలు ఉంటే బుద్ధారం ప్రాంతానికి వచ్చి క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించాలని, తప్పుడు ప్రచారంతో రైతులను గందరగోళానికి గురిచేయవద్దని సూచించారు.ఈ కార్యక్రమంలో పెద్దమందడి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొమ్ము వెంకటస్వామి, మాజీ ఎంపీపీ రఘు ప్రసాద్, వివిధ గ్రామాల సర్పంచ్ లు, మాజీ సర్పంచ్ లు మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments