డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ఎల్కతుర్తి పోలీసుల ఉక్కు పాదం.
సూరారం బ్రిడ్జి వద్ద పోలీసుల విస్తృత తనిఖీలు.
ఎల్కతుర్తి, జూన్ 8 (తెలంగాణ ముచ్చట్లు):
ఎల్కతుర్తి మండల కేంద్రంలోని సూరారం బ్రిడ్జి సమీపంలో సోమవారం ఎల్కతుర్తి పోలీసులు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్, వాహన తనిఖీలు నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని చేపట్టిన ఈ ప్రత్యేక తనిఖీలకు ఎస్సై నర్సింహారావు నాయకత్వం వహించారు.
తనిఖీల సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న పలువురు వాహనదారులను గుర్తించి వారిపై కేసులు నమోదు చేశారు. అలాగే వాహనాల రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ తదితర పత్రాలను పరిశీలించి, సరైన పత్రాలు లేని వాహనాలపై జరిమానాలు విధించారు.
ఈ సందర్భంగా పోలీసులు వాహనదారులకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రాణాంతక ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని, అలాంటి చర్యలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై భవిష్యత్తులో కూడా ప్రత్యేక తనిఖీలు కొనసాగుతాయని ఏఎస్ఐ శంకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ సారంగపాణి, కానిస్టేబుల్ సుమన్, ఎస్‌జీ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.


Comments