భూసార పరిరక్షణే ధ్యేయం.
దమ్మపేటలో సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ.
దమ్మపేట, మే 26 (తెలంగాణ ముచ్చట్లు):
భూసార ఆరోగ్య పరిరక్షణతోనే పంట దిగుబడులు పెరుగుతాయని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. దమ్మపేట మండల కేంద్రంలో మంగళవారం వ్యవసాయశాఖ, సహకారశాఖల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన రైతులకు 50 శాతం సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి భూమిలో సేంద్రియ కర్బనాన్ని పెంచడంలో పచ్చిరొట్ట పంటలు కీలకమని తెలిపారు. జీలుగ, జనుము, పిల్లిపెసర వంటి విత్తనాలను ప్రభుత్వం రాయితీపై అందిస్తున్నందున రైతులు వినియోగించుకోవాలని సూచించారు. వ్యవసాయ విస్తరణ అధికారులు గ్రామస్థాయిలో రైతులకు అవగాహన కల్పించి పచ్చిరొట్ట సాగును ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ అధికారులు, దమ్మపేట సర్పంచ్ పగడాల రమాదేవి–రాంబాబు, సొసైటీ ఉపాధ్యక్షుడు కట్టం యర్రప్ప, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రమేష్, రావు గంగాధర్ రావు, గుజ్జుల శ్రీనివాసరావు, బొల్లికొండ నాగేశ్వరరావు, చిన్నశెట్టి సత్యనారాయణ, చిన్నశెట్టి యుగంధర్, పగడాల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.


Comments