గ్రామస్తులతో కలిసి మంటలను ఆర్పిన సర్పంచ్ సంపత్.
ఎల్కతుర్తి ,మే22 (తెలంగాణ ముచ్చట్లు)
ఎల్కతుర్తి మండలంలోని దండేపల్లి గ్రామ పరిధిలోని నైనేని ఆంజనేయరావు గారి వ్యవసాయ పొలం వద్ద, చర్చ్ సమీపంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఎండల తీవ్రత, వడగాడ్పు ప్రభావంతో మంటలు వేగంగా వ్యాపిస్తూ పక్కనే ఉన్న పొలాలు, గడ్డి వాములకు ముప్పుగా మారాయి. దీంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు.
అయితే ఫైర్ ఇంజన్ ఆలస్యంగా వచ్చే పరిస్థితి ఉండటంతో మంటలు మరింత విస్తరించే ప్రమాదాన్ని గుర్తించిన దండేపల్లి గ్రామ సర్పంచ్ గొలిపెల్లి సంపత్ వెంటనే అప్రమత్తమయ్యారు. గ్రామ పంచాయతీకి చెందిన నీటి ట్యాంకర్‌ను సంఘటనా స్థలానికి తరలించి సహాయక చర్యలు ప్రారంభించారు.
సర్పంచ్ సంపత్ స్వయంగా అక్కడే ఉండి గ్రామస్తులు, యువకులతో కలిసి ట్యాంకర్ పైపు ద్వారా నీటిని చల్లుతూ మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అందరి సమిష్టి కృషితో మంటలు పూర్తిగా ఆరిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని గ్రామ ప్రజలు తెలిపారు.
సర్పంచ్ గొలిపెల్లి సంపత్ సమయస్ఫూర్తితో స్పందించి గ్రామస్తులతో కలిసి మంటలను అదుపు చేయడం పట్ల గ్రామ ప్రజలు అభినందనలు తెలియజేస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు.


Comments