ధరణి తిప్పలకు చెక్.!
- అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు : మంత్రి పొంగులేటి.
- లంచం లేకుండా ఖాతాల్లోకే నిధులు.
- పేదల భూములకు పూర్తి హక్కులు.
సత్తుపల్లి, మే 21 (తెలంగాణ ముచ్చట్లు):
ధరణి పోర్టల్ లోపాలు, గత ప్రభుత్వ తప్పిదాల వల్ల పేదలు, రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. నాడు దొరల గడీల్లో బందీగా ఉన్న భూ రికార్డులను బయటకు తీసుకొచ్చి, పేదలకు భూములపై పూర్తి హక్కులు కల్పిస్తామని స్పష్టం చేశారు. గురువారం సత్తుపల్లిలోని ఎంఆర్ గార్డెన్స్‌లో స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక-ప్రజా దర్బార్’ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. పెనుబల్లి, వేంసూరు, సత్తుపల్లి మండలాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. రాష్ట్రాన్ని గత పాలకులు రూ.8.18 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టేశారని మంత్రి విమర్శించారు. అయినా సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రభుత్వం వెనుకడుగు వేయదన్నారు. గతంలో ఇందిరమ్మ ఇళ్ల పేరుతో కాగితాలకే పరిమితమైన పథకాలు చూపించి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. తమ ప్రభుత్వం తొలి ఏడాదిలోనే రూ.22,500 కోట్లతో నాలుగున్నర లక్షల ఇళ్లు మంజూరు చేసిందన్నారు. ఇప్పటికే 1.25 లక్షల ఇళ్లు పూర్తయ్యాయని, జూన్ నాటికి మరో లక్ష ఇళ్లు సిద్ధమవుతాయని తెలిపారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీని జూన్ 2న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు. లబ్ధిదారుల ఖాతాల్లోకే ప్రతి సోమవారం నేరుగా నిధులు జమ చేస్తున్నామని, ఒక్క రూపాయి లంచానికి కూడా తావులేదన్నారు. ఇళ్లు నిర్మించుకునే పేదలకు ములకలపల్లి క్వారీ నుంచి ఉచితంగా ఇసుక అందిస్తామని తెలిపారు. తమ ప్రభుత్వం రెండేళ్లలోనే 72 వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని, త్వరలోనే మరో ఉద్యోగ ప్రకటన విడుదల కానుందని వెల్లడించారు. సత్తుపల్లి పట్టణంలోని 399 సర్వే నంబర్‌తో పాటు పరిసర గ్రామాల్లోని దాదాపు 6,500 ఎకరాల భూ సమస్యలపై మంత్రి స్పందించారు. బేతుపల్లి, నారాయణపురం ప్రాంతాల్లోని భూములకు పూర్తి స్థాయి సర్వే నిర్వహించి, అర్హులైన రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పహానీల్లో రైతుల పేర్లు నమోదు చేయాలని సూచించారు. రుద్రాక్షపల్లి, కొకపాడు, తాళపెంట, రామచంద్రాపురం, వెంకటగిరి తదితర గ్రామాల్లో కొనసాగుతున్న అటవీ-రెవెన్యూ భూముల వివా
దాలను త్వరగా పరిష్కరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. వర్షాకాలానికి ముందే సరిహద్దులు ఖరారు చేసి, తరతరాలుగా సాగు చేస్తున్న పేదలకు పట్టాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.


Comments