సిపిఐ ఆధ్వర్యంలో ఇంధన, గ్యాస్ ధరలపై ఆగ్రహ ర్యాలీ.
ఎల్కతుర్తి, మే 17 (తెలంగాణ ముచ్చట్లు)
ఎల్కతుర్తి మండలంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా సిపిఐ ఆధ్వర్యంలో ఆగ్రహ ర్యాలీ మరియు వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. నిరసనలో భాగంగా సిపిఐ నాయకులు ఆటోను, బైక్‌ను తాళ్లతో లాగుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసించారు. పెరిగిన ఇంధన ధరలతో వాహనాలను నడపడం కూడా భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలతో పేదలు, సామాన్య ప్రజలు గుడిబండలా బతుకులు లాగాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ కార్పొరేట్ రంగానికి, పెట్టుబడిదారులకు లక్షల కోట్ల రూపాయల రాయితీలు అందిస్తోందని విమర్శించారు. మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని, దీని ప్రభావం సామాన్య ప్రజల జీవనంపై తీవ్రంగా పడుతోందన్నారు.
ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు చమురు ధరలు పెరిగినా కూడా డీజిల్, పెట్రోల్, గ్యాస్, సిఎన్‌జీ ధరలను పెంచబోమని ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభల్లో ప్రజలకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే ఎన్నికలు పూర్తయ్యాక గుంటనక్కలా వేచి చూసి మళ్లీ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచడం శోచనీయమన్నారు. ప్రజలపై భారాన్ని మోపకుండా వెంటనే ఇంధన, గ్యాస్ ధరలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో రైతులు, కార్మికులు, చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. డీజిల్ ధరలు పెరగడంతో వ్యవసాయ ఖర్చులు అధికమై రైతులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. రవాణా ఛార్జీలు పెరగడంతో కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరిగి ప్రజలపై అదనపు భారం పడుతోందన్నారు.
అలాగే వంటగ్యాస్ ధరలు పెరగడం వల్ల గృహిణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మధ్యతరగతి కుటుంబాల జీవనం కష్టతరమైందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించి ప్రజలకు ఊరట కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఊట్కూరి రాములు, సిపిఐ మండల కార్యదర్శి శనిగరపు రాజ్ కుమార్, సిపిఐ సహాయ కార్యదర్శి మర్రి విజయ్, తండ ముండయ్య, చంద్రమౌళి, మోహన్ రెడ్డి, గోపాల్‌పూర్ సర్పంచ్ కర్రె లక్ష్మి, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Comments