రైతులను కాపాడాలంటే కాలువల పూడిక తీయాలి.
బిజెపి మండల అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్.
ఎల్కతుర్తి, మే 15( తెలంగాణ ముచ్చట్లు):
రైతులను ముంపు ప్రమాదం నుంచి కాపాడాలంటే మండలంలోని గొలుసుకట్టు కాలువలు, పిల్ల కాలువల పూడికను తక్షణమే తొలగించాలని బిజెపి మండల అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎల్కతుర్తి మండలంలోని 20 గ్రామాల పరిధిలో ఉన్న కాలువల దుస్థితిపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో అధికారులు నిర్లక్ష్యం వీడి ముందస్తు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. కాలువల్లో పేరుకుపోయిన పూడిక కారణంగా ప్రతి ఏడాది వర్షపు నీరు సాఫీగా వెళ్లక రైతులు, గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పంట పొలాలు నీటమునిగిపోవడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని అన్నారు.
అక్రమణలకు గురైన గొలుసుకట్టు కాలువలు, కెనాల్ కాలువలను గుర్తించి వెంటనే పునరుద్ధరణ పనులు ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. బావుల వద్ద ఉన్న కాలువలు, పొలాలకు నీరందించే పిల్ల కాలువలు పూర్తిగా దెబ్బతిన్నాయని, వాటికి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని కోరారు.
ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేసి పనులు ప్రారంభించకపోతే బిజెపి ఆధ్వర్యంలో మండల వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని శ్రీకాంత్ యాదవ్ హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కంచర్ల శంకరయ్య, ఆడెపు శ్రీవర్ధన్, కొడం రమేష్, మాటూరు విద్యాసాగర్, చీరాల రంజిత్, సూదిరెడ్డి సాయిరెడ్డి, రవి తదితరులు పాల్గొన్నారు.


Comments