రైతన్న గళం గర్జించబోతోంది… కరీంనగర్‌లో రైతు మహా సమరభేరికి సన్నాహాలు!
హుజురాబాద్, మే 13(తెలంగాణ ముచ్చట్లు ):
రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఈనెల 30వ తేదీన కరీంనగర్‌లో భారీ స్థాయిలో నిర్వహించనున్న “రైతు మహా గర్జన సమరభేరి” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రైతు సంఘాల సమాఖ్య జాతీయాధ్యక్షుడు పోలాడి రామారావు పిలుపునిచ్చారు. బుధవారం హుజురాబాద్‌లో సభకు సంబంధించిన గోడపత్రాలను ఆవిష్కరించి రైతాంగాన్ని చైతన్యపరిచే కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతాంగం నేడు అనేక ఇబ్బందులతో సతమతమవుతోందన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, సాగునీటి కొరత, ఎరువులు–విత్తనాల సమస్యలు, విద్యుత్ అంతరాయాలు, అకాల వర్షాలతో రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. రైతు సమస్యలపై ప్రభుత్వాలు సరైన స్పందన చూపడం లేదని విమర్శించారు.
రైతుల హక్కుల సాధన కోసం, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టేందుకు కరీంనగర్‌లో నిర్వహించే రైతు మహా గర్జన సమరభేరికి ప్రతి గ్రామం నుంచి రైతులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. రైతుల ఐక్యతే సమస్యల పరిష్కారానికి మార్గమని పేర్కొన్నారు.
ఈ గోడపత్రాల ఆవిష్కరణ కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొని సభ విజయవంతానికి కృషి చేయాలని సంకల్పించారు.


Comments