ఉపాధి కూలీల సమ్మెను విజయవంతం చేయాలి.!
జాజిరి శ్రీనివాస్ పిలుపు.
Views: 35
On
సత్తుపల్లి, మే 8(తెలంగాణ ముచ్చట్లు):
ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీల సమస్యలను పరిష్కరించాలని, ఈ నెల 15న నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. శుక్రవారం సత్తుపల్లి మండలంలోని రామానగరం గ్రామంలో ఉపాధి పనులు చేస్తున్న కూలీలను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి సమస్యల పరిష్కారం కోసం ఖమ్మం కలెక్టరేట్ ఎదుట జరిగే ధర్నాలో పెద్దఎత్తున పాల్గొనాలని కోరారు. వామపక్షాల పోరాటాల ఫలితంగానే యూపీఏ ప్రభుత్వం 2005లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. 2006 అక్టోబర్ నుంచి అమలులోకి వచ్చిన ఈ చట్టం వల్ల కోట్లాది మంది గ్రామీణ పేదలకు ఉపాధి లభించిందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు తగ్గడమే కాకుండా వ్యవసాయ కార్మికులకు కనీస వేతనాలు పెరిగాయని చెప్పారు. ఆడ, మగ తేడా లేకుండా సమాన వేతనాలు అమలులోకి రావడం ఉపాధి హామీ చట్టం ద్వారానే సాధ్యమైందన్నారు. కరోనా, ఆర్థిక మాంద్యం వంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలను ఆదుకున్నది ఈ చట్టమేనని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరిచే చర్యలు చేపట్టిందని ఆరోపించారు. కేంద్రం నిధుల వాటాను తగ్గించి రాష్ట్రాలపై భారం మోపుతోందన్నారు. పని దినాలు పెంచినట్లు ప్రకటించినప్పటికీ వ్యవసాయ సీజన్‌లో పనులు నిలిపివేయడం సరికాదన్నారు. కనీస వేతనాలను పెంచాలని, పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం రామానగరం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో 100 మంది కూలీలకు మజ్జిగ పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఒంటెద్దు వెంకటమ్మ, మండల అధ్యక్షురాలు పిల్లి నాగమణి, కార్యదర్శి కువ్వారపు లక్ష్మణరావు, ప్రజానాట్యమండలి నాయకులు అయినంపూడి సుందరరావు, మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments