పేదరికాన్ని జయించి 'డాక్టర్‌' అయిన చైతన్య సాయి.

పేదరికాన్ని జయించి 'డాక్టర్‌' అయిన చైతన్య సాయి.

◆ డీసీఎం డ్రైవర్ కొడుకు అద్భుత విజయం
◆ ప్రభుత్వ పాఠశాల నుంచి మెడికల్ కాలేజ్ వరకూ…
◆ తల్లిదండ్రుల త్యాగానికి గర్వకారణమైన కుమారుడు
 
ఖమ్మం బ్యూరో , మే 7(తెలంగాణ ముచ్చట్లు)
 
కష్టపడి చదివే గుణం, కన్నవారి కష్టాన్ని తీర్చాలనే తపన ఉంటే ఎంతటి లక్ష్యాన్నైనా ముద్దాడవచ్చని ఖమ్మం బిడ్డ నామవరపు చైతన్య సాయి నిరూపించారు. ఖమ్మం నగరంలోని జహీర్‌పుర, గుట్టల బజార్ ప్రాంతానికి చెందిన నామవరపు చైతన్య సాయి తన కృషి, పట్టుదల, చదువుపట్ల ఉన్న మక్కువతో డాక్టర్‌గా ఎదిగి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం పరిధిలోని మహబూబ్‌నగర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో అతి సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఈ యువకుడు బుధవారం సాయంత్రం డాక్టరేట్ పట్టా అందుకొని తన తల్లిదండ్రుల కలలను నిజం చేశాడు.
తల్లి నామవరపు రేణుక గృహిణిగా, తండ్రి నామవరపు కోటయ్య డీసీఎం డ్రైవర్‌గా ఎన్నో కష్టాలు పడుతూ కుమారుడిని చిన్ననాటి నుంచే ప్రభుత్వ పాఠశాలలో చదివించారు. ఆర్థిక ఇబ్బందులు అడుగడుగునా ఎదురైనా, “చదువే భవిష్యత్తు” అనే నమ్మకంతో కుమారుడి విద్య కోసం తల్లిదండ్రులు చేసిన త్యాగం చివరకు ఫలించింది.
చిన్నప్పటి నుంచే చదువులో మెరిట్ విద్యార్థిగా గుర్తింపు తెచ్చుకున్న చైతన్య సాయి, క్రమశిక్షణతో చదువుకుంటూ ప్రతి తరగతిలోనూ ప్రత్యేక ప్రతిభ కనబరిచేవాడు. పెద్దల పట్ల గౌరవం, లక్ష్యంపై అచంచల నమ్మకం, కష్టపడే స్వభావం అతడిని ఈ స్థాయికి తీసుకువచ్చాయి. దళిత కుటుంబానికి చెందిన చైతన్య సాయి ఎంతో పోరాటం చేసి మెడికల్ సీట్ సాధించాడు. అనంతరం కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ పరిధిలోని మహబూబ్‌నగర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో మెడిసిన్ విద్యను పూర్తిచేసి డాక్టర్‌గా పట్టా పొందాడు. డాక్టరేట్ పట్టా అందుకున్న క్షణంలో తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎన్నో కష్టాలను భరించి చదివించిన తమ కుమారుడు డాక్టర్‌గా ఎదగడం చూసి కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. గుట్టల బజార్ ప్రాంతంలోనూ ఆనందోత్సవాలు వెల్లివిరిశాయి. స్థానికులు, బంధువులు, స్నేహితులు చైతన్య సాయికి శుభాకాంక్షలు తెలుపుతూ అతని విజయాన్ని గర్వంగా కొనియాడారు.
“పేదరికం చదువుకు అడ్డంకి కాదు… పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదు” అని చైతన్య సాయి విజయం మరోసారి నిరూపించింది. కష్టపడి చదివితే సమాజంలో గౌరవం, గుర్తింపు ఎలా వస్తాయో ఈ యువ డాక్టర్ జీవితం నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ఈ కార్యక్రమంలో నామవరపు సైదమ్మ, కొత్తపల్లి వీరమణి, కుక్కల వసంత, కొత్తపల్లి ప్రసాద్, కొత్తపల్లి మేఘన, కొత్తపల్లి సంధ్య, హనీ తదితరులు పాల్గొని చైతన్య సాయిని అభినందించారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జై పొన్నం నినాదాలతో మారుమోగిన మాలపల్లె. జై పొన్నం నినాదాలతో మారుమోగిన మాలపల్లె.
హుస్నాబాద్. మే 08 (తెలంగాణ ముచ్చట్లు):   హుస్నాబాద్ మండలం మాలపల్లె గ్రామంలో రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలను...
తిరిగి బాధ్యతలు చేపట్టిన పెద్దమందడి సింగిల్ విండో పాలకమండలి.
పెద్దమందడి సింగిల్ విండో నూతన సీఈఓ సుధాకర్‌కు ఘన సన్మానం.
జగత్‌పల్లి సర్పంచ్ పెంటన్న యాదవ్‌ను పరామర్శించిన డా. జిల్లెల ఆదిత్యరెడ్డి.
“ప్రజాస్వామ్యాన్ని దాడులతో అణిచేయలేరు”… కాంగ్రెస్ నేత ఆర్‌ఎస్ గౌడ్ ఫైర్.
కోతుల బెడదకు చెక్.. హుజూరాబాద్ ప్రజలకు ఊరట.
పేదరికాన్ని జయించి 'డాక్టర్‌' అయిన చైతన్య సాయి.