బుగ్గవాగు చెక్ డ్యాం సవరించిన అంచనాలకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్.
Views: 3
On
- సీఎం రేవంత్, మంత్రి మండలికి మంత్రి తుమ్మల కృతజ్ఞతలు.
కామేపల్లి, రఘునాథపాలెం మండలాలకు మహార్దశ
ఖమ్మం బ్యూరో , మే 4(తెలంగాణ ముచ్చట్లు )
ఖమ్మం జిల్లాలో సాగునీటి రంగానికి బలాన్నిచ్చే బుగ్గవాగు ఎడమ వరద కాలువ పనుల సవరించిన అంచనాలకు రాష్ట్ర క్యాబినెట్ ఈ రోజు ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మంత్రిమండలికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాజెక్టు అమలుతో కామేపల్లి, రఘునాథపాలెం మండలాల్లో వ్యవసాయ రంగానికి నూతన దశ ప్రారంభమవుతుంది.
బుగ్గవాగు ఆనకట్ట నుంచి ఎడమ వరద కాలువ, బ్రాంచ్ కాలువల నిర్మాణం, అనుబంధ సివిల్ పనుల కోసం మొత్తం రూ.88.42 కోట్ల సవరించిన పరిపాలనా అనుమతికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ప్రారంభ అంచనా రూ.39.21 కోట్లుగా ఉన్నప్పటికీ, ప్రాజెక్టు రూపకల్పనలో సాంకేతిక మార్పులు, ఆధునికీకరణ కారణంగా వ్యయం పెరిగింది. తాజా అంచనాల ప్రకారం పనుల ఖర్చు రూ.53.29 కోట్లు, పన్నులు రూ.21.23 కోట్లు, భూసేకరణకు రూ.10.71 కోట్లు, ఇతర వ్యయాలకు రూ.3.19 కోట్లు కేటాయించారు.
ఈ ప్రాజెక్టు అమలుతో కామేపల్లి, రఘునాథపాలెం మండలాల్లోని 13 గ్రామాలకు చెందిన 31 చెరువులను వరద నీటితో నింపే అవకాశం లభిస్తుంది. దాదాపు 2,866 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరగనుండటంతో, రైతులకు నిత్య సాగునీటి భరోసా కలుగుతుంది. ఇది వ్యవసాయ ఉత్పాదకత పెంపుకు, రైతుల ఆదాయ వృద్ధికి దోహదం చేయనుంది.
గతంలో భూసేకరణ సమస్యలు, రైతుల అభ్యంతరాల కారణంగా ఈ పనులు నిలిచిపోయిన నేపథ్యంలో, మంత్రి తుమ్మల ప్రత్యేక చొరవతో ప్రాజెక్టు రూపకల్పనలో కీలక మార్పులు చేశారు. ఓపెన్ కాలువ తవ్వకానికి బదులుగా భూగర్భ పైపులైన్ (గ్రావిటీ మెయిన్) విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా భూసేకరణ అవసరం 232 ఎకరాల నుంచి కేవలం 51 ఎకరాలకు తగ్గింది. దీంతో రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రాజెక్టు అమలు సాధ్యమవుతోంది.
ఈ కాలువ పనులు చేపట్టడం వలన నూతనంగా కామేపల్లి మండలంలో 23 చెరువులు, రఘునాథపాలెం మండలంలో 8 చెరువులను ఈ కాలువ ద్వారా వరద నీటితో నింపి, రైతులకు సాగునీటిని అందించవచ్చు. ప్రస్తుతం రఘునాథపాలెం మండలంలోని చెరువులకు మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగునీరు అందుతున్నప్పటికీ, ఎత్తిపోతల కోసం ప్రభుత్వానికి విద్యుత్ ఖర్చు భరించాల్సి వస్తుంది. బుగ్గవాగు ఎడమ కాలువ పూర్తయిన తర్వాత, గ్రావిటీ విధానంలోనే నీరు సరఫరా అవ్వడం వల్ల విద్యుత్ వినియోగం పూర్తిగా తగ్గి, ప్రభుత్వానికి గణనీయమైన ఆర్థిక ఆదా కలుగుతుంది. ఈ ప్రాజెక్టు అమలుతో కామేపల్లి మండలంలోని 23 చెరువులు, రఘునాథపాలెం మండలంలోని 8 చెరువులు మరియు మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం ద్వారా నింపబడే చెరువులు నింపబడుతూ, రఘునాథపాలెం మండలం మొత్తం ప్రాంతం సస్యశ్యామలం వైపు దూసుకెళ్లనుంది. దీని ఫలితంగా పంటల విస్తీర్ణం పెరగడం, పంటల వైవిధ్యం పెరగడం, రైతుల జీవన ప్రమాణాలు మరియు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడం వంటి అనేక ప్రయోజనాలు కలగనున్నాయి.
ఈ ప్రాజెక్టు అమలులో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. క్యాబినెట్ ఆమోదంతో పనులు వేగవంతం కానుండగా, ఖమ్మం జిల్లాలో సాగునీటి వనరులు మరింత బలోపేతం కావడంతో పాటు రఘునాథపాలెం మండలం సస్యశ్యామలంగా మారే దిశగా కీలక అడుగు పడినట్టైంది.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
05 May 2026 17:01:04
ఎల్కతుర్తి, మే 5( తెలంగాణ ముచ్చట్లు):
ప్రజాపాలన ప్రగతిప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా దండేపల్లి గ్రామంలో నిర్వహించిన “రైతుల ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమం రైతుల్లో కొత్త...


Comments