లారీలు లేవు… గోదాములు లేవు… రైతుల పంటకు దారి లేదు!
Views: 3
On
జమ్మికుంట టౌన్ మే 06 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట కొత్త మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం రైతులకు ఆశగా మారాల్సింది పోయి ఆందోళనకు కారణమైంది. వారం రోజులుగా తమ పంటను విక్రయించేందుకు వచ్చిన రైతులు కేంద్రం వద్దే పడిగాపులు కాస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి బుధవారం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ—ఏప్రిల్ 29న అట్టహాసంగా ప్రారంభించిన కొనుగోళ్లు ఇప్పటికీ 10 శాతం కూడా పూర్తికాలేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “పంట చేతికొచ్చింది… కానీ మార్కెట్‌లో అమ్మే పరిస్థితి లేదు” అంటూ రైతుల బాధను వ్యక్తం చేశారు.
సుమారు 30 వేల క్వింటాళ్ల మొక్కజొన్న కేంద్రానికి చేరినా, లారీలు లేకపోవడం, గోదాములు సరిపోకపోవడం వల్ల బస్తాలు పేరుకుపోతున్నాయని తెలిపారు. తూకం వేసిన ధాన్యం కూడా రోజులు గడిచినా లిఫ్ట్ చేయకపోవడం రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తోందన్నారు.
అకాల వర్షాల హెచ్చరికల మధ్య రైతులు భయాందోళనలో ఉన్నారని, ఎప్పుడు వర్షం పడుతుందో తెలియని పరిస్థితిలో పంటను కాపాడుకోవడం కష్టమవుతోందని చెప్పారు. “ఇలాంటి పరిస్థితుల్లో కొనుగోళ్లు యుద్ధ ప్రాతిపదికన జరగాలి… కానీ ఇక్కడ మాత్రం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది” అని విమర్శించారు.
మార్క్‌ఫెడ్ వద్ద సిబ్బంది కొరత కూడా ప్రధాన సమస్యగా మారిందని, వెంటనే అదనపు సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు. థంబ్ ఇంప్రెషన్ సమస్యల వల్ల అనేక మంది రైతులు మద్దతు ధరకు అమ్ముకోలేకపోతున్నారని, దీనికి తక్షణ పరిష్కారం చూపాలని కోరారు.
మార్కెట్‌లో కనీస మద్దతు ధరకు, బయట మార్కెట్ ధరకు క్వింటాలుకు సుమారు రూ.700 తేడా ఉండటంతో మధ్య దళారులు రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ప్రతి మండలానికి ప్రత్యేక కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేకుండా పారదర్శకంగా కొనుగోళ్లు జరపాలని సూచించారు.
రైతుల సమస్యల పరిష్కారానికి అధికార పార్టీ, ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయాలని, రాజకీయాలకు అతీతంగా రైతులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు దండిగారి సతీష్, వడ్లూరి కిషోర్, శీలం అశోక్, కాయిత లింగారెడ్డి, లింగంపల్లి శ్రీనివాస్‌తో పాటు గుండారపు కుమారస్వామి, ఉష్కే మల్ల సంజీవ్, సమ్మయ్య, భూమి రెడ్డి, రజిత, రాజిరెడ్డి, రాజేశ్వరరావు, మల్లయ్య తదితర రైతులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
07 May 2026 17:38:11
ఎల్కతుర్తి, మే 07( తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామానికి చెందిన ఆటో కార్మికుడు మాచర్ల అశోక్ అనారోగ్యంతో కిడ్నీ ఫెయిల్ కావడంతో...


Comments