అదనపు కట్నం కోసం వేధింపులు...భర్త సహా నలుగురిపై కేసు నమోదు.
జమ్మికుంట టౌన్ మే 10 (తెలంగాణ ముచ్చట్లు):
అదనపు కట్నం తీసుకురావాలని వివాహితను శారీరకంగా, మానసికంగా వేధించిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలు ఇగ్గేటి అనూష తెలిపిన వివరాల ప్రకారం, ఆమెకు గత సంవత్సరం ఉల్లంపల్లి గ్రామానికి చెందిన బుల్లి అజయ్‌కుమార్‌తో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. వివాహ సమయంలో ఆమె తల్లిదండ్రులు ఒక ఎకరం భూమి, రూ.8 లక్షల నగదు, ఇతర లాంఛనాలతో ఘనంగా పెళ్లి జరిపించినట్లు పేర్కొన్నారు.
పెళ్లి అనంతరం కొంతకాలం దంపతులు సఖ్యంగా ఉన్నప్పటికీ, అనంతరం భర్త అజయ్‌కుమార్ మద్యం అలవాటుకు బానిసై తరచూ దుర్భాషలాడుతూ వేధించేవాడని ఫిర్యాదులో తెలిపారు. ఈ విషయాన్ని అత్త బుల్లి రామ, మామ కొమురయ్య, బావ రంజిత్, ఆరాలు మమత దృష్టికి తీసుకెళ్లినా వారు భర్తకు మద్దతుగా నిలిచి, అదనపు కట్నంగా రూ.5 లక్షలు తీసుకురావాలని ఒత్తిడి చేశారని ఆరోపించారు.
డబ్బు తీసుకురాకపోతే ఇంట్లో ఉండనివ్వమని బెదిరిస్తూ శారీరక, మానసిక వేధింపులకు గురిచేసి ఇంటి నుంచి పంపించివేశారని బాధితురాలు పేర్కొన్నారు. ఈ విషయమై ఈ ఏడాది ఏప్రిల్ 22న పెద్దలు మూగల పరుశురాం, కంకాల కుమారస్వామి సమక్షంలో పంచాయతీ జరిగినప్పటికీ వారి ప్రవర్తనలో మార్పు రాలేదని తెలిపారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు భర్తతో పాటు కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Comments