ధాన్యం కొనుగోళ్లపై మండిపడ్డ సండ్ర.
- 45 రోజులైనా రైతులకు ఉపశమనం లేదు.
- ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు తీవ్ర నష్టాల్లోకి వెళ్లారన్న మాజీ ఎమ్మెల్యే.
సత్తుపల్లి, మే 14 (తెలంగాణ ముచ్చట్లు):
రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య విమర్శించారు. సత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ వరి కోతలు ప్రారంభమై 45 రోజులు గడిచినా రైతులకు సరైన కొనుగోలు సదుపాయాలు కల్పించలేదన్నారు. ప్రభుత్వం ఆలస్యంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడంతో జిల్లాలో 70 శాతం పైగా ధాన్యం ఇప్పటికే వ్యాపారస్తుల చేతికి వెళ్లిపోయిందని ఆరోపించారు. రైతులు క్వింటాకు రూ.500 వరకు నష్టపోయి తక్కువ ధరకే ధాన్యం విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కాకర్లపల్లి, బుగ్గపాడు గ్రామాల్లో ఇప్పటికీ రోడ్లపైనే ధాన్యం రాశులు కనిపిస్తున్నాయని, ఇటీవల కురిసిన వర్షాలతో ధాన్యం మొలకెత్తిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మా ప్రభుత్వం కేసీఆర్ హయాంలో పంటల కొనుగోళ్లకు ముందుగానే సమగ్ర ప్రణాళిక రూపొందించి బస్తాలు, కొనుగోలు కేంద్రాలు, తేమ కొలిచే యంత్రాలు, మిల్లులు, గోదాములు సిద్ధం చేసేవారని గుర్తుచేశారు. ప్రస్తుతం మాత్రం ఏప్రిల్ 6న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేసరికి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. మిల్లర్ల వద్ద క్వింటాకు 12 కిలోల వరకు తరుగు వేస్తున్నారని, లారీలు రోజుల తరబడి వేచి ఉండాల్సి రావడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారని తెలిపారు. కల్లూరు గోదాములో ఒక ట్రాక్టర్ మొక్కజొన్న దింపడానికి 15 రోజుల వరకు ఎదురుచూడాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వ సూచనల మేరకు జిల్లాలో 2.40 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారని, మద్దతు ధర రూ.2450 ప్రకటించినప్పటికీ ప్రస్తుతం రైతులు రూ.1500-1600కే అమ్ముకోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. దీంతో క్వింటాకు రూ.800 వరకు నష్టం వాటిల్లుతోందన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సత్తుపల్లి నియోజకవర్గంలో యాసంగి సీజన్‌లో భారీ స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు జరిగేవని తెలిపారు. ప్రస్తుతం కాకర్లపల్లి సొసైటీలో ఈ సీజన్‌లో ఒక్క కొనుగోలు కేంద్రంలోనే కేవలం 13 లారీల ధాన్యం మాత్రమే కొనుగోలు జరిగిందని పేర్కొన్నారు. దీన్నిబట్టి ప్రభుత్వ చిత్తశుద్ధి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందన్నారు. సన్నధాన్యానికి బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా, ఇప్పటికే 70 శాతం మంది రైతులు బయటే ధాన్యం విక్రయించారని తెలిపారు. ఇప్పుడు ప్రభుత్వ కేంద్రాల్లో అమ్మిన రైతులకే బోనస్ ఇస్తే మిగిలిన రైతులకు అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల వారీగా సన్నధాన్యం సాగు చేసిన రైతులను గుర్తించి బోనస్ అందించాలని డిమాండ్ చేశారు. బస్తాల పంపిణీలో రాజకీయ జోక్యం పెరిగిపోయిందని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు సూచించిన వారికే బస్తాలు, కార్డులు ఇస్తున్నారని విమర్శించారు. రైతు వేదికలు, సొసైటీ భవనాలు వినియోగించకుండా కొనుగోలు కేంద్రాలను రాజకీయ కేంద్రాలుగా మార్చారని అన్నారు. మిగిలిన ధాన్యం, ఇంకా కొనుగోలు కాని మొక్కజొన్నను వెంటనే కొనుగోలుచేసి రైతులకు ఉపశమనం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.


Comments