అపర భగీరధుడు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కి ఘన సత్కారం.
ఖమ్మం బ్యూరో, మే 15(తెలంగాణ ముచ్చట్లు )
ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి విశేష కృషి చేసిన రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ని ఖమ్మం పౌరసమితి అధ్యక్షులు డాక్టర్ పులిపాటి ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలసి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం ఖమ్మం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగింది.
తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ ప్రజా జీవితంలో ప్రవేశించి 44 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా డాక్టర్ పులిపాటి ప్రసాద్ ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన డాక్టర్ పులిపాటి ప్రసాద్ తుమ్మల నాగేశ్వరరావు ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధిని ధ్యేయంగా పెట్టుకుని ప్రజాసేవలో నిరంతరం ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. పలు ముఖ్యమంత్రుల ప్రభుత్వాల్లో మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ అనేక అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేశారని తెలిపారు.
జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు ఆసుపత్రుల నిర్మాణం ద్వారా విద్యా మరియు వైద్య రంగాల అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని గ్రామీణ ప్రాంతాల్లో ప్రాజెక్టులు లిఫ్ట్ ఇరిగేషన్లు కాలువల నిర్మాణం ద్వారా రైతులకు అండగా నిలిచారని అన్నారు. అలాగే గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో మంచినీటి సౌకర్యం కల్పించి ప్రజల అవసరాలను తీర్చారని పేదలకు ఇళ్ల స్థలాలు పక్కా గృహాలు నిర్మించి వారికి గూడు కల్పించారని వివరించారు.రోడ్లు రహదారులు ప్రభుత్వ భవనాల నిర్మాణంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి పునాది వేశారని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి చరిత్రలో తుమ్మల కి ప్రత్యేక స్థానం ఉంటుందని కొనియాడారు. ఆయనను మచ్చలేని నాయకుడు అపర భగీరధుడుగా అభివర్ణించారు.
ఈ కార్యక్రమంలో పౌరసమితి నాయకులు పట్నాయక్ వెంకటేశ్వరరావు మాధవరావు శ్రీనివాస్ రావు, సతీష్ ఖాజా వెంకటేశ్వరరావు అనిల్ తదితరులు పాల్గొన్నారు.
చివరగా తుమ్మల నాగేశ్వరరావు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవిస్తూ సమాజానికి మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు.


Comments