జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలి.
–కూలీల ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలి
-- బీకేఎంయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కర్రె లక్ష్మణ్
ఎల్కతుర్తి, మే 15 (తెలంగాణ ముచ్చట్లు):
దేశవ్యాప్తంగా గ్రామీణ పేదలకు ఉపాధి కల్పిస్తూ వారి కొనుగోలు శక్తిని పెంచిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ (బీకేఎంయూ) హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి కర్రె లక్ష్మణ్ డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరిచే విధంగా కొత్త చట్టాన్ని తీసుకురావాలని ప్రయత్నించడం పేదల జీవనోపాధిపై దెబ్బతీసే చర్య అని ఆయన విమర్శించారు.
శుక్రవారం ఎల్కతుర్తి మండలంలోని దామెర, చింతలపల్లి గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులను బీకేఎంయూ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మండుతున్న ఎండల్లో పని చేస్తున్నప్పటికీ సరైన కూలి అందడం లేదని, పని ప్రదేశాల్లో నీడ, మంచినీటి సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కూలీలు నాయకులకు వివరించారు.
జిల్లా ప్రధాన కార్యదర్శి కర్రె లక్ష్మణ్ మాట్లాడుతూ, గ్రామీణ పేదల పోరాటాల ఫలితంగా వామపక్ష పార్టీల సహకారంతో వచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించడం హేయమైన చర్య అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.362 దినకూలి ఎక్కడా అమలు కావడం లేదని, చాలా గ్రామాల్లో రూ.300కు మించి కూలి అందడం లేదని తెలిపారు. సమ్మర్ అలవెన్సులు, ఇతర భత్యాలు కూడా కూలీలకు అందడం లేదని అన్నారు. పని అడిగిన వారికి పనులు లేవని అధికారులు చెప్పడం దారుణమన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఉపాధి హామీ చట్టాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయాలని, కూలీలకు కనీస వేతనం, సమ్మర్ అలవెన్సులు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పని ప్రదేశాల్లో తాగునీరు, నీడ వంటి మౌలిక సౌకర్యాలు కల్పించాలని అధికారులను కోరారు.
ఉపాధి హామీ సమస్యలపై గ్రామీణ పేదలను సమీకరించి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని నాయకులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీకేఎంయూ జిల్లా అధ్యక్షుడు మునిగొండ బిక్షపతి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏదునూరి వెంకటరాజం, ఏఐకేఎస్ జిల్లా కార్యదర్శి ఊటుకూరు రాములు, సీపీఐ మండల కార్యదర్శి శనిగరపు రాజ్‌కుమార్, నాయకులు తండ మొండయ్య తదితరులతో పాటు ఉపాధి కూలీలు పాల్గొన్నారు.


Comments