మండల–గ్రామ కమిటీలు లేక కాంగ్రెస్ శ్రేణుల్లో రాజకీయ నిరుద్యోగం.

మండల–గ్రామ కమిటీలు లేక కాంగ్రెస్ శ్రేణుల్లో రాజకీయ నిరుద్యోగం.

నామినేటెడ్ పదవులు, స్థానిక ఎన్నికలపై ఆశలు ఆవిరి.. కేడర్‌లో పెరుగుతున్న అసహనం

వనపర్తి,మే14(తెలంగాణ ముచ్చట్లు):

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ వనపర్తి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గ్రామ, మండల స్థాయి నాయకులు–కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.మండల, గ్రామ కమిటీల పదవి కాలం గడువు ముగిసింది. మండల, గ్రామ కమిటీల ఏర్పాటు జరగకపోవడంతో కేడర్ పూర్తిగా నిరాశలోకి వెళ్లిందని అంటున్నారు.ఎన్నికల సమయంలో పార్టీ కోసం గ్రామాల్లో తిరిగి, ఆర్థికంగా ఖర్చు పెట్టి, ప్రత్యర్థులను ఎదుర్కొన్న కార్యకర్తలకు ఇప్పుడు గుర్తింపు లేకుండా పోయిందనే భావన బలపడుతోంది.నామినేటెడ్ పదవుల భర్తీ కూడా ఆలస్యం కావడంతో అధికారంలో ఉన్నామనే ఫీలింగ్ కూడా లేకుండా పోయింది అంటూ పలువురు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.ఇక స్థానిక స్థాయిలో కాంట్రాక్టు పనులు లేకపోవడం కూడా కాంగ్రెస్ శ్రేణుల్లో అసంతృప్తికి కారణమవుతోంది. గతంలో అధికార పార్టీలకు అనుబంధంగా పనిచేసే కేడర్‌కు చిన్నపాటి పనులు, కాంట్రాక్టులు, కమిటీల్లో అవకాశాలు దక్కేవని, ప్రస్తుతం అలాంటి పరిస్థితి కనిపించకపోవడంతో కార్యకర్తలు రాజకీయంగా, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు.అలాగే సర్పంచ్ ఎన్నికల అనంతరం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతాయని వనపర్తి జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎంతో ఆశతో ఎదురుచూశారని తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా గ్రామ, మండల స్థాయిలో పార్టీకి మరింత బలం చేకూరుతుందని, కష్టపడ్డ కార్యకర్తలకు రాజకీయ అవకాశాలు లభిస్తాయని భావించినా ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేడర్‌లో తీవ్ర నిరాశ నెలకొన్నట్లు సమాచారం.ఎన్నికలు ఉంటే కనీసం కార్యకర్తలకు రాజకీయంగా గుర్తింపు దక్కేది అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.ఈ అసంతృప్తి ఇటీవల వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కేంద్రంలో జరిగిన కాంగ్రెస్ మండల కమిటీ ఇంచార్జ్ సమీక్షా సమావేశంలో కూడా బహిర్గతమైనట్లు సమాచారం. ఏప్రిల్ నెలలో నిర్వహించిన ఆ సమావేశంలో పలువురు మండల నాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేయడం జరిగింది. ఎన్నికల సమయంలో కష్టపడి పనిచేసి, గ్రామాల్లో తిరిగి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాం. కానీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ స్థాయి నాయకులకు, కార్యకర్తలకు గుర్తింపు లేకుండా పోయింది అంటూ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు.అలాగే ఆలస్యం చేయకుండా మండల కమిటీని వెంటనే పూర్తి చేయాలని ఆ సమావేశంలో నాయకులు స్పష్టం చేశారు.అయితే సమావేశం జరిగి నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు కమిటీ ఏర్పాటు కాకపోవడం కార్యకర్తల్లో మరింత నిరాశను పెంచుతోందని అంటున్నారు.చాలా చోట్ల కార్యకర్తలు ఎమ్మెల్యేలు, మంత్రుల కార్యక్రమాలకు తెల్ల చొక్కాలు వేసుకొని హాజరు కావడానికే పరిమితమయ్యామని లోలోపల అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.గ్రామస్థాయి నాయకత్వానికి ప్రాధాన్యం లేకపోవడం వల్ల పార్టీపై కేడర్‌లో నమ్మకం దెబ్బతింటోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.ఇప్పటికైనా పార్టీ అధిష్ఠానం మండల, గ్రామ కమిటీల నియామకంతో పాటు నామినేటెడ్ పోస్టుల భర్తీ, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై దృష్టి పెట్టకపోతే రాబోయే రోజుల్లో ఈ అసంతృప్తి మరింత పెరిగే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ప్రాణాలు కాపాడే తొలి గంటే “గోల్డెన్ అవర్” ప్రాణాలు కాపాడే తొలి గంటే “గోల్డెన్ అవర్”
రోడ్డు ప్రమాద బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించాలిమెడికవర్ వైద్యులు రాజీవ్ రెడ్డి, వేణుగోపాల్ సూచనలు* హుజురాబాద్‌, మే 15(తెలంగాణ ముచ్చట్లు ): రోడ్డు ప్రమాదాల సమయంలో ప్రమాదం...
డీసీఎం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు.. జమ్మికుంటలో కేసు నమోదు.
అపర భగీరధుడు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కి ఘన సత్కారం.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలి.
దొడగుంటపల్లి మత్స్య సహకార సంఘం అధ్యక్షుడిగా జంగం గోపాల్ ఏకగ్రీవ ఎన్నిక.
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తి చేయాలి
జమ్మికుంట మున్సిపాలిటీలో జీతాల పెంపు పేరిట లక్షల వసూళ్లు..?